అదిరిందయ్యా..అనిల్.. ఉపాధి వేటలో వినూత్న ఆలోచన
పొట్టకూటి కోసం ఉద్యోగాన్ని వెతుక్కుని అలసిపోతేనో,
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పొట్టకూటి కోసం ఉద్యోగాన్ని వెతుక్కుని అలసిపోతేనో, దొరికిన ఉద్యోగానికి వచ్చే వేతనం సరిపోక కుటుంబ కష్టాలు తీరక పోతేనో మనిషి సొంతంగా ఉపాధిని వెతుక్కునే ఆలోచన చేస్తాడు.ఆర్థిక కష్టాలు కసిగా తరిమితే తప్ప మనిషి ఆలోచించడానికి ఇష్టపడడు. ఆలోచనలకు పదును పెడితే ఉపాధి మార్గాలు దొరుకుతాయి..
అలాంటి ఆలోచనతోనే ఓ యువకుడు పెద్దగా పెట్టుబడి లేకుండా తన ఆలోచననే పెట్టుబడిగా పెట్టి కేవలం రూ.15 వేల ఖర్చుతో ఓ మోటార్ బైక్ ట్రాలీని తయారు చేసుకున్నాడు. ఆ ట్రాలీని తన టూ వీలర్ బైక్ కు అమర్చుకుని ట్రాలీపై 9 వెజిటేబుల్ ట్రేలు పెట్టుకుని ఒక్కో ట్రేలో ఒక్కో రకం కూరగాయలు నింపుకుని చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నాడు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పోతునూరు గ్రామానికి చెందిన నీరడి అనిల్ అనే 31 ఏళ్ల యువకుడు పేద కుటుంబానికి చెందిన వాడు. ఎక్కువగా చదువుకోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును పలక , బలపం వదిలేసి 13 ఏళ్ల వయసులోనే ట్రాక్టర్ డ్రైవర్ గా అవతారమెత్తాడు. ట్రాక్టర్ యజమాని ఇచ్చే జీతం డబ్బులతో కుటుంబ అవసరాలకు అండగా ఉండటంతో జీవితంలో డబ్బు విలువ, సంపాదన విలువ తెలుసుకున్నాడు.
ట్రాక్టర్ డ్రైవర్ గా ఎంత పని చేసినా వచ్చే జీతం డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదనే ఆలోచనతో పాస్ పోర్ట్ తీసి ఉపాధి వేటలో ఎడారి దేశం దుబాయికి వెళ్ళాడు. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడ పని చేసినా అక్కడి కంపెనీలో చేసిన కష్టానికి తగిన ఫలితం లేదనే ఆలోచనతో తిరిగి సొంతూరికి వచ్చేశాడు. ట్రాక్టర్ డ్రైవర్ గా మళ్లీ లైఫ్ ట్రావెల్ ను కొనసాగిస్తున్నాడు. కానీ, కొత్తగా ఏదో చేయాలి.. కుటుంబ అవసరాలకు సరిపోయేలా, ఊళ్లో తలెత్తుకుని తిరిగేలా ఇంకా సంపాదించాలి అనే ఆలోచన కొడుతూనే ఉంది. ఆటో కొనుక్కొని కూరగాయల వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆటో కొనేందుకు డబ్బులు లేక బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నిస్తే బ్యాంకులో చుక్కెదురైంది. తెలిసిన వాళ్ళను అప్పు అడిగితే వీరి ఆర్థిక పరిస్థితి చూసి ఎవరూ అప్పివ్వలేదు. బాధతో ఆలోచిస్తూ గడుపుతూ ఉండగా ట్రాక్టర్ ట్రాలీ కనిపించింది. ట్రాక్టర్ ఇంజిన్ కు తగిలించిన ట్రాలీ లాంటిదే బైక్ కు తగిలించేలా ఓ ట్రాలీ తయారు చేసుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఇప్పుడు అతనికి ఉపాధి మార్గాన్ని చూపించింది.
తనకు తెలిసిన విధంగా తన ఆలోచనలకు తగ్గట్టుగా ట్రాలీని డిజైన్ చేశాడు. ట్రాలీకి అమర్చేందుకు రెండు మోటార్ బైక్ చక్రాలను తన బంధువు దగ్గర వాడకంలో లేని పాత బైక్ చక్రాలను సేకరించాడు. ఇంకేముంది తను డిజైన్ చేసిన ట్రాలీ తయారైంది. రూ. 15 వేల ఖర్చుతో ట్రాలీని సొంతంగా తయారు చేసుకుని, కేవలం రూ. 5 వేల పెట్టుబడితో కూరగాయలు కొనుగోలు చేసి గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు అమ్మే ఉపాధిని ఎంచుకున్నాడు. ప్రతి రోజూ ఖర్చులన్నీ పోను రూ. 1000 లు మిగులుతున్నాయని, ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూరగాయలు అమ్ముకుని, మళ్లీ ట్రాక్టర్ డ్రైవర్ గా కూడా పని చేస్తున్నట్లు అనిల్ తెలిపాడు. ఉపాధి లేదని, పెట్టుబడి లేక వ్యాపారం చేసుకోలేక పోతున్నామని ఇబ్బందులు పడే కన్నా ఉన్నంతలో పార్ట్ టైం వ్యాపారం చేసుకోడానికి నాకు ఈ ఆలోచన కరెక్ట్ అనిపించిందని అనిల్ పేర్కొన్నాడు.ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదనే సాకుతో పని లేకుండా జులాయిగా తిరిగే ఎందరో యువతకు, నిరుద్యోగులకు అనిల్ ఆదర్శంగా కనిపిస్తున్నాడు. జీవితంలో నిలదొక్కుకోవడానికి అనిల్ చేస్తున్న ప్రయత్నాన్ని చూసి జనాలు అదిరిందయ్యా అనిల్.. అంటూ పొగిడేస్తున్నారు.