సీఎం కేసీఆర్ పాము లాంటోడు: రేవంత్ రెడ్డి

పది సంవత్సరాలుగా మోసం చేస్తూ, మీకు అన్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెప్పే అవకాశం వచ్చిందని

Update: 2023-11-28 11:50 GMT

దిశ, భిక్కనూరు: పది సంవత్సరాలుగా మోసం చేస్తూ, మీకు అన్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెప్పే అవకాశం వచ్చిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఏకతాటిపై నిలబడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలని అప్పుడే మన బతుకులు బాగుపడతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని, దోమకొండ బీబీపేట మండల కేంద్రాల్లో రోడ్ షో లు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ పేదలకు అన్ని రకాలుగా న్యాయం జరగాలంటే ఇందిరమ్మ రాజ్యం తోనే సాధ్యమవుతుందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయలేదని, మీ పిల్లలకు నౌకర్లు ఇవ్వలేదని, పేదలకు భూములు పంపిణీ చేయలేదని, పేదలకు పట్టాలు ఇవ్వలేదన్నారు. రెండు పర్యాయాలుగా ఏమి చెయ్యని సీఎం కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు ఇక్కడికి వచ్చాడని ప్రశ్నించారు.అటువంటి సీఎం కేసీఆర్ తనను ఈసారి గెలిపిస్తే, మీ సంసారం చక్కదిద్దుతా, వాకిట్లో కల్లాపి చల్లి, ముగ్గులు వేస్తానంటూ సుద్దులు పలికి ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు.

గజ్వేల్‌లో భూములన్ని ఖతం పట్టించాడని, కామారెడ్డిలో భూములు పచ్చగా కనబడడంతో ఆయన కళ్ళు దోమకొండ, కామారెడ్డి ప్రాంతంలో ఉన్న భూముల పై పడ్డాయని, అటువంటి నాయకునికి ఓటు వేసి గెలిపిస్తే, తాత ముత్తాతల కాలం నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూములు, మనకు దక్కుతాయా...? ఒకసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ను గనక దారితప్పి గెలిపిస్తే, పాముకు పాలు పోసి పెంచితే, ఏ విధంగా కాటేస్తుందో, ఓటు వేసి గెలిపిస్తే పాములాంటోడు కేసీఆర్ మిమ్మల్ని కాటేసి.. మీ భూములు గుంజుకుంటాడని హెచ్చరించారు. ఈనెల 30న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తద్వారా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని అప్పుడే పేదలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నా రు.

అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. 2016 ఉన్న పెన్షన్ ను 4 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో పారిశ్రామికవేత్త తిమ్మయ్య గారి వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, దోమకొండ జెడ్పీటీసీ సభ్యులు తీగల తిర్మల్ గౌడ్, దోమకొండ మండల ఇంచార్జ్ రజని, దోమకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, బీబీపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, భూమా గౌడ్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Similar News