మహిళలకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ .. రూ.10 లక్షల బీమా..

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆపన్న హస్తం

Update: 2024-11-09 08:46 GMT

దిశ, ఆలూర్ : స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆపన్న హస్తం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మహిళా గ్రూపులో సభ్యురాలిగా ఉండి లోన్‌ తీసుకున్న మహిళ ఏదైనా కారణంతో చనిపోతే... ఆ లోన్‌ మొత్తం మాఫీ అయ్యేలా వారి పేరిట బీమా చేయించాలని నిర్ణయించింది. మహిళలపై భారం పడకుండా ఈ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించేందుకు ఇప్పటికే రూ.50.41 కోట్లు మంజూరు చేసింది. అంతేగాక, ఈ బీమా ప్రయోజనాలను ఈ ఏడాది మార్చి 14 నుంచే వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. బ్యాంకు లింకేజీ లోన్లతోపాటు స్త్రీనిధి లోన్లకు కూడా ఈ లోన్‌ బీమా వర్తించనుంది. క్షేత్ర స్థాయిలో బీమా క్లెయిమ్‌ చేసే విధానంపై ఇప్పటికే సెర్చ్‌, మెప్మా సిబ్బందికి గైడ్‌ లైన్స్‌ అందాయి.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 27 మండలాలు, 23796 సంఘాలు,254565 సభ్యులు. అదేవిధంగా 4 నగర పురపాలకలు 8789 సంఘాలు 89786 సభ్యులు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు,16254 సంఘాలు,162545 సభ్యులు అదేవిధంగా 3 నగర పురపాలకలు 17151 సంఘాలు 171897 సభ్యులు.రాష్ట్రవ్యాప్తంగా 64.35 లక్షల మంది మహిళలకు లబ్ధి. 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్‌) పరిధిలోని 4,30,358 స్వయం సహాయక సంఘాల్లో 46.46 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉండగా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని 1.78 లక్షల గ్రూప్ లో కలిపి 17.89 లక్షల మంది సభ్యులున్నారు. వీరందరికి లోన్‌ బీమా/ప్రమాద బీమా! స్త్రీనిధి సురక్ష బీమా వర్తించనుంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మహిళా గ్రూపులకు బ్యాంకులతో పాటు స్త్రీనిధి రుణాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ రుణాలు తీసుకున్న వారిలో కొందరు మహిళలు ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు. వారి వాటా ధనం చెల్లించడం సమస్యగా మారుతోంది. గ్రూపుగా తీసుకున్న లోన్‌ ను గ్రూపుగానే చెల్లించాల్సి ఉంటుంది. మృతురాలి కుటుంబ సభ్యులు లోన్‌ కిస్తీ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో గ్రూపులోని మిగతా సభ్యులపై ఆ భారం పడుతోంది. చనిపోయిన మహిళ వాటా ధనం తీసేసి..తమ లోన్‌ కిస్తీని చెల్లించేందుకు మిగతా సభ్యులు వెళ్తే బ్యాంకు ఆఫీసర్లు తీసుకోవడం లేదు. దీంతో గ్రూప్‌ మొత్తం కిస్తీలు చెల్లించడం ఆపేయడంతో ఆ గ్రూప్‌ ఎన్‌ పీఏ జాబితాలోకి వెళ్తోంది. ఈ సమస్య నుంచి మహిళలను బయటపడే సేందుకే రాష్ట్ర ప్రభుత్వం లోన్‌ బీమా స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది.

రూ. 2 లక్షల వరకు రుణమాఫీ.. రూ.10 లక్షల ప్రమాద బీమా..

ఈ స్కీమ్‌లో భాగంగా లోన్‌ తీసుకున్న మహిళలు ఎవరైనా ఏ కారణంతో చనిపోయినా వారు తీసుకున్న లోన్‌ రూ.2 లక్షల వరకు మాఫీ కానుంది. ప్రస్తుతం గరిష్టంగా ఒక్కో మహిళకు ఇస్తున్న లోన్‌ రూ.2 లక్షలు మాత్రమే. దీంతో మిగతా సభ్యులు తమ కిస్తీలు చెల్లిస్తే సరిపోతుంది. చనిపోయిన మహిళ బ్యాంకు లింకేజీ రుణం, స్త్రీ నిధి లోన్‌ రెండూ తీసుకుని ఉంటే మాత్రం ఒక లోన్‌ మాత్రమే మాఫీ కానుంది. అలాగే ప్రమాదవశాత్తూ మహిళా గ్రూపు సభ్యురాలు చనిపోతే యాక్సిడెంటల్‌ బీమా కింద రూ.10 లక్షలు మృతురాలి కుటుంబానికి చెల్లించనున్నారు.

అర్హులు ఎవరంటే..

గ్రామీణ /పురపాలక పరిధిలోని స్వయం సహాయక సంఘాలో సభ్యులై ఉండాలి. వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి.

మహిళలకు బీమాను ఎత్తేసిన బీఆర్‌ఎస్‌ సర్కార్‌...

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ సర్కార్‌ హయాంలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలంతా అభయ హస్తం స్కీమ్‌లో ఉండేవారు. వారికి ఆమ్‌ ఆద్మీ బీమా యోజన వర్తించేది. ఈ పథకంలో ఉన్న మహిళ లేదా ఆమె భర్త ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75 వేలు, సహజ మరణమైతే రూ.30 వేల పరిహారం ఇచ్చేవారు. అంత్యక్రియలకు మరో రూ.5 వేలు చెల్లించేవారు. సభ్యుల పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు రూ.1,200 స్కాలర్‌ షిప్‌ కూడా అందించేవారు. కానీ, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్‌ రద్దు చేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు గానీ, వారి భర్తలు గానీ మరణిస్తే పరిహారం అందలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక లోన్‌ బీమాను అమలు చేయడం బాగానే ఉన్నప్పటికీ... ఆమ్‌ ఆద్మీ యోజనలోని ప్రయోజనాలను వర్తింపజేస్తే బాగుంటుందని మహిళా సంఘాల సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

రూ. 10 లక్షలు బీమా పథకం హర్షణీయం : ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మహిళా సంఘాలకురూ. 10 లక్షల బీమా పథకాన్ని మొదలుపెట్టిందని, ఈ బీమా ప్రకారం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు తోడుపడుతుందని, అదేవిధంగా మహిళా సంఘాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం పెరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక అభినందనలు..

బీమా పథకాన్ని అమలు చేస్తాం : గంగారాం గ్రామీణ అభివృద్ధి అధికారి...

గ్రూప్ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ బకాయిలు కట్టేందుకు ఆ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బీమా పథకం ద్వారా వచ్చిన సొమ్ములో బకాయిలు పట్టుకొని మిగతా డబ్బులను కుటుంబ సభ్యులకు అందిస్తామని అన్నారు.


Similar News