రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవితలు వ్యాపార భాగస్వాములు
నిజామాబాద్ జిల్లాలో బీజేపీని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పంపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు.
దిశ ప్రతినిది, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బీజేపీని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పంపించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవితలు కలిసి వ్యాపారం చేస్తారని వారు ఇరువురు వ్యాపార భాగస్వాములుగా కంపెనీ ఉందని వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్ అర్బన్ ముఖ్య కార్యకర్తల సమావేశం బస్వా గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు ధర్మపురి శ్రీనివాస్ కు దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకుని ఆనాడు , నేడు అతని తనయుడు ధర్మపురి సంజయ్ కు రావాల్సిన ఎమ్మెల్యే సీటును ఆకుల లలిత గుంజుకుంటుందని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను మున్నూరు కాపులు నమ్మవద్దని సూచించారు. మోసం వారి చరిత్రలోనే ఉందని గుర్తించాలని మున్నూరు కాపులకు సేవ చేసిన వారెవ్వరో గుర్తించాలని అన్నారు. తాను ఎన్నడూ కుల రాజకీయాలు చేయలేదని, తాను ఒక మోడికి మాత్రమే అభిమానినని అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ తరపున బలమైన అభ్యర్థి బరిలో ఉంటారని, 30న జరిగే ఎన్నికల్లో గంగా జమునా తహజీబ్ లాగా హిందూవులు, ముస్లింలు అని తేడా లేకుండా దేశం కోసం పాటుపడే వ్యక్తులకు ఓటు వేయాలన్నారు. మైనార్టీలు తమకు మైనార్టీ బంధు ఎందుకు పది లక్షలు ఇవ్వడం లేదో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. మైనార్టీలను రాష్ట్ర ప్రభుత్వం దళితులకన్నా
హీనంగా చూస్తుందన్నారు. జనాభా పరంగా, ఓటర్ల పరంగా ఎక్కువగా ఉన్న మైనార్టీలను పది సంవత్సరాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మైనార్టీలకు మైనార్టీ బంధు కింద రూ.10 లక్షలు ఎందుకు ఇవ్వలేదంటే ఎవరి వద్ద సమాధానం లేదన్నారు. బతికున్నప్పుడు రాని డబ్బులు సచ్చిన తర్వాత ఇస్తామని రూ.5 లక్షల రైతు బీమా ప్రకటన చేయడంపై ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాలు కలిగిన రైతులకు రైతు బీమా వర్తించదటా అని ఆరోపించారు. కేసీఆర్ చనిపోతే తాను 5 లక్షలు ఇస్తానని, కేటీఆర్ చనిపోతే రూ.10 లక్షలు ఇస్తానని, కవిత చనిపోతే రూ.20 లక్షలు స్వయంగా చెల్లిస్తానని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు.