రేవంత్ కు కామారెడ్డిలో మూడవ స్థానమే

లక్షలు వెచ్చిస్తూ... సర్పంచులను నాయకులను కొన్నంత మాత్రాన, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడవ స్థానమే దక్కుతుందని, ఆయన గెలిచేది లేదు సచ్చేది లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2023-11-25 10:09 GMT

దిశ, భిక్కనూరు : లక్షలు వెచ్చిస్తూ... సర్పంచులను నాయకులను కొన్నంత మాత్రాన, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడవ స్థానమే దక్కుతుందని, ఆయన గెలిచేది లేదు సచ్చేది లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో అశేష జనవాహిని మధ్య రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సినిమా టాకీస్ చౌరస్తాలో జరిగిన కార్నర్ షో లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. కొడుకు పుట్టకముందే కుల్ల కొట్టుకున్నట్లు కాంగ్రెస్ లో సీఎం నేనంటే నేను అంటూ పదిమంది నేతలు ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మూడవసారి అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఢిల్లీలో గులాబీ జెండా ఎక్కడ పాతుతాడోననే భయంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీలు ఇక్కడే బొండిగా పిసికేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

     సీఎం కేసీఆర్ ఈ ప్రాంత రైతుల ఇంచు పట్టా భూమి కూడా గుంజుకోడని, అనవసరంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. వారి మాటలను నమ్మి ఆగం కావద్దని, ఎవరి భూమి కూడా గుంజుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు లేదని పునరుద్ఘాటించారు. ఇందుకు పూర్తి బాధ్యత తనదేనన్నారు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తుండు అన్నట్లు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం మీ అందరి అదృష్టమన్నారు. కొడంగల్ లో చెల్లని రూపాయి, ఇక్కడ చెల్లుతదా...? అక్కడ అమ్ముడు పోని ఎద్దు, కామారెడ్డి అంగట్లో అమ్ముడుపోతదా అంటూ రేవంత్ రెడ్డి పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సలాకా సిమెంట్ కు

    ఆశపడి, బతుకులను ఆగం చేసుకోవద్దన్నా రు. లోకల్, నాన్ లోకల్ అంటూ ప్రాంత విభేదాలు తీసుకొస్తున్న బీజేపీ అభ్యర్థి కాటిపల్లి స్థానికుడు కాదని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ లోకల్ నాయకుడన్న విషయాన్ని గ్రహించాలన్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో ఓట్లు అడగడం తగదని, మార్పు కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అడుగుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 ఛాన్సులు ఇస్తే రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా కాలేశ్వరం ప్రాజెక్ట్ 22వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి, ఈ ప్రాంత రైతుల పాదాలు కడుగుతామని స్పష్టం చేశారు.

గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ...

తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా గల్ఫ్ బాధితులను ఆదుకుంటామన్నారు. ఉన్న సంక్షేమ పథకాలే కాకుండా, మరో నాలుగు కొత్త పథకాలను అమలు చేయబోతున్నట్లు వివరించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి డిసెంబర్ తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి, సర్పంచు తునికి వేణు, బోండ్ల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు షో సక్సెస్ తో శ్రేణుల్లో జోష్...

రోడ్డు షో సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ దిగి, ఓపెన్ టాప్ వాహనమెక్కి సినిమా టాకీస్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా మంత్రి కేటీఆర్ కుడి, ఎడమ చేతులు ఊపుతూ అప్పుడప్పుడు విక్టరీ సింబల్ చూపుతూ ఉత్సాహం నింపడం కనిపించింది. 


Similar News