రైతన్న నడ్డి విరుస్తున్న రైస్ మిల్లర్లు...
ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని భరోసా రాకపోవడంతో రంగంలోకి రైస్ మిల్లర్లు దిగి దొరికింది అదునుగా చేసుకొని రైస్ మిల్లర్లు తక్కువ రేటు పెట్టడంతో రైతన్న పరిస్థితి అడకత్తెరలో పోకలాగా మారింది.
దిశ, గాంధారి : ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని భరోసా రాకపోవడంతో రంగంలోకి రైస్ మిల్లర్లు దిగి దొరికింది అదునుగా చేసుకొని రైస్ మిల్లర్లు తక్కువ రేటు పెట్టడంతో రైతన్న పరిస్థితి అడకత్తెరలో పోకలాగా మారింది. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టే రకంగా రైస్ మిల్లర్ల వ్యవహార శైలి అలాగే ఉంది. కామారెడ్డి జిల్లా వివిధ మండల కేంద్రాల్లో ఆరుగాలం అహర్నిశలు కష్టపడి పంటలు వేసి దాన్ని కాపాడుకుంటూ వచ్చి చివరికి ప్రభుత్వం తప్పకుండా తమ యొక్క ధాన్యం గింజను కొంటుందని ఎదురుచూస్తూ ఉంటే... కొందరు రైతన్నలు అటు ఎప్పుడు వస్తుందో తెలియని వర్షం భయంతో ఉన్న పంట ఎక్కడ పాడైపోతుందని బెంగతో మిల్లర్లకు అమ్ముకుంటున్న పరిస్థితి. పంట నారు పోసి నీరు పెట్టి చేతికొచ్చే వరకు తన పూర్తి దృష్టి పంట అమ్ముడుపోయే వరకు బెంగగానే ఉంటాడు... దీనికి తోడు పంట చేతికొచ్చిందని అనుకొని ఆశపడేలోపే ప్రకృతి అన్నదాతను సంతోషంగా ఉంచకుండా వర్షం రూపంలో కన్నీరు పెట్టిస్తుంది.
పచ్చి వడ్లు క్వింటాలకు 1800 రూపాయలు చొప్పున కొనుగోలు...
ప్రభుత్వం రైతన్నలు పండించిన పంటలను తప్పకుండా కొంటారని ఎంతో ఆశతో కొంతమంది రైతులు ఇంకా తమ యొక్క పంటను కాపాడుకుంటూ ఆరబోస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ ధర ప్రకారం 2320 రూపాయలు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నకు భంగపాటే మిగులుతుంది... ఇప్పటికే అకాల వర్షాలతో ఎంతోమంది రైతన్నలు తమ తడిసి ముద్దైన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియని దుర్భర పరిస్థితిలో ఉన్నారు.... దీంతో మిల్లర్లు రంగ ప్రవేశం చేసి క్వింటాలుకు 1800 నుండి 1850 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి వచ్చే క్వింటాలు ధరలో రైస్ మిల్లర్ కొనే ధరకు దాదాపు 500 రూపాయల వ్యత్యాసం ఉంది కానీ ఇదే వాస్తవం.
వడ్లు టన్నుకు ఐదు కిలోలు బియ్యం క్వింటాల్కు కేజీ పేరిట తరుగు పేరిట వసూలు...
రైతన్న పండించిన పంటను గిట్టుబాటు ధర వచ్చిన రాకుండా తన అపోసొపోచేసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు రేటు రాకపోయినా తన అత్యవసర పరిస్థితిని అదునుగా చేసుకొని రైస్ మిల్లర్లు 1800 నుండి 1850 రూపాయలు రేటుగా నిర్ధారించిన అందులో టన్నుకు ఐదు కిలోలు తూకంలో తరుగు పేరిట అదనంగా వసూలు చేసి రైతన్న నడ్డి విరుస్తున్నారు.
మిల్లర్లకు తౌడు, ఉనుక ప్లస్... రైతన్నకు రేటు హమాలి అన్ని మైనస్ లే....
రైతన్న దగ్గర నుండి కొన్న పచ్చి వడ్లను క్వింటాళ్ల రూపంలో కొనుగోలు చేసి ఆ వచ్చిన వడ్లను బియ్యం గా మార్చే ప్రక్రియలో మిల్లర్లకు తౌడు వునుక రెండు అదనంగా రావడమే కాకుండా రైతన్న దగ్గర నుండి తరుగు పేరిట చాలదన్నట్టుగా అన్ని ప్లస్ లు రైస్ మిల్లర్లు అదనంగా పొందుతుంటే ఒక్క రైతన్న మాత్రం కేవలం అటు వడ్ల విక్రయ రేటు విషయంలో వడ్లను రైస్ మిల్లుకు తరలించే ట్రాక్టర్ల విషయంలో హమాలీల విషయంలో అన్ని మైనస్ లే.... ఎటు చూసినా రైస్ మిల్లర్లు ప్లస్ గాను రైతన్న మైనస్ గాను మిగిలిపోతున్నారు.