ఆస్తి పంపకాలు సమానంగా జరగాల్సిందే.. అప్పటివరకు అంత్యక్రియలను ఆపాల్సిందే..

చెరి సమానంగా ఆస్తి పంపకాలు జరగాలని, అప్పటి వరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు జరపకుండా నిలిపివేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Update: 2024-12-28 01:55 GMT

దిశ, భిక్కనూరు : చెరి సమానంగా ఆస్తి పంపకాలు జరగాలని, అప్పటి వరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు జరపకుండా నిలిపివేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన ఏనుగు లింగవ్వ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. మృతురాలికి ఏనుగు పెంటా రెడ్డి, ఏనుగు రాంరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్న కుమారుడు రాంరెడ్డి, ఆమె పేరిట ఉన్న భూమినే కాకుండా, తన అన్న పెంటా రెడ్డి పేరిట ఉన్న భూమిని సైతం తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆస్తి పంపకాల విషయమై అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా పంచాయతీ నడుస్తోంది.

ఆస్తి పంపకాల విషయమై వారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మాట్లాడి సమాన పంపకాలు చేసేందుకు ముందుకు వచ్చినప్పుడల్లా, తమ్ముడు రాంరెడ్డి కేసులు పెట్టి భయపెట్టిస్తుండేవాడు. అయితే తల్లి మరణించడంతో ఇదే మంచి అవకాశంగా భావించి, ఆస్తి మొత్తాన్ని సమానంగా పంచి, తన పేరున రిజిస్ట్రేషన్ చేసేవరకు అంత్యక్రియల కార్యం ఆగల్సిందేనని అన్యాయమైన అన్న పెంటా రెడ్డి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అందరి సలహా సూచనల మేరకు అన్యాయం అయిపోయిన అన్న పెంటారెడ్డికి, సమానంగా ఆస్తి పంపకాలను చేసి రిజిస్ట్రేషన్ చేసిచ్చేందుకు సోదరుడు రాంరెడ్డి ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. వెంటనే భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి స్లాట్ కూడా బుక్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ శుక్రవారం జరగాల్సి ఉండగా, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో అనుకోకుండా సెలవు రావడంతో రిజిస్ట్రేషన్ శనివారానికి వాయిదా పడింది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే కూలింగ్ బాక్స్ లో పెట్టిన మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.


Similar News