ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని విధాలుగా సన్నద్ధం..
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణ కై ఈ నెల 06 నుండి చేపట్టనున్న ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణ కై ఈ నెల 06 నుండి చేపట్టనున్న ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కోసం అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటింటి సర్వే ఏర్పాట్లపై శనివారం రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత కాల వ్యవధి లోపు ఇళ్ల జాబితా (హౌజ్ లిస్టింగ్) రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసి ఎన్యుమరేషన్ బ్లాక్ లను పక్కాగా గుర్తించాలన్నారు. తదనుగుణంగా పూర్తిస్థాయిలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను సర్వేలో భాగస్వాములు చేయాలని, ఏకకాలంలో సర్వే, డేటా ఎంట్రీ సమాంతరంగా జరిగేలా చొరవ చూపాలన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ఏ ఒక్క నివాస గృహం సైతం తప్పిపోకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు మధ్యాహ్నం ఒంటి గంట అనంతరం సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సర్వే సందర్భంగా సేకరించిన ఆయా కుటుంబాల స్థితిగతులకు సంబంధించిన వివరాలను వెంటదివెంట ఆన్లైన్ లో నిక్షిప్తం చేసేలా సరిపడా సంఖ్యలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించడం జరిగిందన్నారు. ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులు మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇప్పించామని, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాల్లో పక్కాగా సర్వే నిర్వహించేలా సన్నద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.
వీ.సీ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమావేశమై ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై కీలక సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలు, గందరగోళానికి తావులేకుండా ఎన్యూమరేటర్లు పక్కాగా సర్వే నిర్వహిస్తూ, ఆయా కుటుంబాలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించేలా చూడాలన్నారు. సూపర్వైజర్లు సర్వే తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, ఎన్యుమరేటర్లు సేకరించిన వివరాలను నిశితంగా పరిశీలించాలని, తప్పులు లేకుండా ఆన్లైన్లో వాటిని నమోదు చేయించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, డీఈఓ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.