పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియకు శ్రీకారం

పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

Update: 2024-03-26 09:03 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు(పీ.ఓ), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏ.పీ.ఓ)లను, ఇతర పోలింగ్ అధికారులు (ఓ.పీ.ఓ)లను ర్యాండమైజెషన్ ద్వారా కేటాయించారు.

     రిజర్వ్ సిబ్బందిని కలుపుకుని జిల్లా పరిధిలోని ఆరు సెగ్మెంట్లకు గాను మొత్తం 7711 మంది పోలింగ్ సిబ్బందిని నియమిస్తూ ర్యాండమైజేషన్ జరిపారు. వీరిలో పీఓలు 2008 మంది ఉండగా, ఏపీఓ లు 2056 , ఓపీఓలు 3647 మంది ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ విధుల కోసం నియమించబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సీపీఓ జి.మల్లికార్జున్, శ్రీకాంత్, ఎన్ఐసీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. 


Similar News