కాంగ్రెస్ ప్రభుత్వ క్యాబినెట్‌లోకి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి..!

తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలిచి అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపోమాపో కొలువుదీరనుంది.

Update: 2023-12-04 07:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలిచి అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపోమాపో కొలువుదీరనుంది. ఆదివారం ఫలితాల తర్వాత సీఎల్పీ భేటీ జరుగుతుండడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఫలితాల తర్వాత వెంటనే రాజీనామా చేయడం, దానిని గవర్నర్ ఆమోదించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చకచక ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఫలితాలు వెలువడిన తర్వాత డిసెంబర్ 9న తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే స్పష్టమైన మెజారిటీ రావడంతో క్యాంప్(రిసార్ట్) రాజకీయాలకు అవకాశం లేకుండానే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ కల్చర్‌కు భిన్నంగా ఏకాబిప్రాయంతోనే మంత్రివర్గ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అనే చర్చ మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలో అత్యంత సీనియర్ అయిన మాజీ మంత్రి, పీసీసీ కోశాధికారి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి తెలంగాణలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక మొదలుకుని వారి గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నించిన సుదర్శన్ రెడ్డిని కేబినెట్ ర్యాంక్ వరించడమనేది ఖాయంగా ఉంది. సుదర్శన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ క్యాబినెట్‌లో తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవులను నిర్వర్తించారు. 2014-2018 ఎన్నికల ఓటమితో ఆయన వెనుకబడ్డప్పటికీ, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్‌లు ఓక్కోక్కరు పార్టిని విడిన అయన మాత్రం పార్టీలో కొనసాగుతూ నిజామాబాద్ జిల్లాలో సీనియర్‌గా పేరు గడించారు. ఆయనకు మంత్రి పదవి స్థానం ఇప్పించడంలో పార్టీ చొరవ తీసుకుంటుందని చర్చ జరుగుతుంది.

నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన డా.రేకులపల్లి భూపతి రెడ్డి కి మంత్రి పదవి దక్కుతుందా, మరేదైనా పదవి ఇస్తారా అనే చర్చ ఉంది. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరు ఉన్న మహ్మద్ షబ్బీర్ అలీ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో అతనికి ఎమ్మెల్సీ చేసి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా లేకపోలేదు. రాష్ట్రంలో మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరు గెలవ కపోవడంతో షబ్బీర్ అలీకి ఏదైనా పదవి ఇస్తారా అనే ప్రచారం పార్టీలో ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన కలకుంట్ల మధన్ మోహన్ సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ గా టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న మధన్ మోహన్ కామారెడ్డిలో సీనియర్ నాయకుడు. ఏఐసిసితో పాటు పీసీసీలో తనకున్న సంబంధాల నేపథ్యంలో క్యాబినెట్‌లో పదవి కోసం ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతుంది.

2018లో జహిరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి తరువాత కామారెడ్డి జిల్లాలో పార్టిని గ్రౌండ్ స్థాయికి తీసుకుపోవడంలో మదన్ పాత్ర మరువలేనిది. కామారెడ్డి జిల్లాలో తనతో పాటు తోట లక్ష్మి కాంత్ రావు, ఎనుగు రవింధర్ రెడ్డిలకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి పార్టిలో తన ప్రాధాన్యత చెప్పకనే చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా నుంచి మధన్ మోహన్, లక్ష్మీకాంత్ రావులు గెలువగా అక్కడ మదన్ మోహన్ బలమైన నేతగా ఉండడంతో మంత్రి పదవి ఇస్తారా లేక ఏదైనా కార్పొరేషన్ పదవి అప్పజెబుతారా అనే ప్రచారం జరుగుతుంది. మరికొన్ని గంటలు గడిస్తే కానీ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనేది తేలిపోనుంది.


Similar News