చిన్నారి పై అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ రిమాండ్..

జీవధాన్ పాఠశాలలో మంగళవారం జరిగిన ఘటనలో పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం, పోలీసుల పై దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు.

Update: 2024-09-25 10:04 GMT

దిశ, కామారెడ్డి : జీవధాన్ పాఠశాలలో మంగళవారం జరిగిన ఘటనలో పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం, పోలీసుల పై దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. గత రెండు రోజులుగా జీవధాన్ పాఠశాలలో జరుగుతున్న ఘటనలపై కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 23 న జీవధాన్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ళ చిన్నారి పట్ల పీఈటీ అసభ్యకరంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు పై నిందితుని పై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు. ఈ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారని తెలిపారు.

ఈ కేసులో శాస్త్రీయ పద్దతిలో విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. నిందితుని హిస్టరీ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు. జీవధాన్ పాఠశాలలో జరిగిన ఆందోళనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయని, ఏఆర్ కానిస్టేబుల్ కాలు విరిగిందన్నారు. వయొలెన్స్ సృష్టించిన వారిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి వయొలెంట్ యాక్ట్ మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొందరిని గుర్తించి జాబితా తయారు చేశామని, వారిలో దాడులకు పాల్పడిన వారిని గురిస్తామన్నారు. చిన్నారి ఆరోగ్యం పై సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన వారి పై కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు పాల్గొన్నారు.

ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్..

మంగళవారం జీవధాన్ పాఠశాలలో జరిగిన ఆందోళనను పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. పాఠశాలలో కావాలనే అల్లర్లు సృష్టించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే జీవధాన్ పాఠశాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జీవధాన్ పాఠశాలతో పాటు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. పాఠాశాలలో అల్లర్లు సృష్టించిన వారిని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. పలువురిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


Similar News