ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అన్నారు.

Update: 2024-02-13 10:07 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : ప్రజలు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అన్నారు. 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా మంగళవారం జిల్లాలోని మేఘన ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జరీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల నుండి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ హాస్పిటల్ నుండి ప్రారంభమై ఆర్టీసీ బస్టాండ్ తిలక్ గార్డెన్ రైల్వే స్టేషన్ - ఎన్టీఆర్ చౌరస్తా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

    ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాలా మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్​ అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి మంచి భవిష్యత్తును కోల్పోకూడదు అని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలే ప్రధానమని, వాహనదారులు ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నుండి దూరంగా ఉండాలని అన్నారు. యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని, చట్టాలను గౌరవించి వాటిని పాటించాలని, రోడ్డు ప్రమాదాలలో ముఖానికి లేదా శరీరానికి బలమైన గాయాలు లేదా ఎముకలు విరిగినప్పుడు సర్జరీ ద్వారా బాగు చేయవచ్చని, కానీ తలకి గాయం అయితే చాలా కష్టం కాబట్టి హెల్మెట్​ ధరించకుండా అజాగ్రత్తగా వాహనం నడిపి. తమను నమ్ముకున్న తల్లిదండ్రులకు గర్భశోకం రాకుండా చూడాలని తెలియజేశారు.

     కావున యువత తప్పకుండా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్​ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, అయినా ఎంతో మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకోసం వాహనాదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రధానంగా ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్​ ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్​బెల్టు ధరించాలని, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదు అన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలన వలన దాదాపు 320 మంది మరణిస్తున్నారని,

    680 మంది క్షతగాత్రులు అవుతున్నారని తెలిపారు. మేఘన డెంటల్ కాలేజీలో విద్యార్థులకు స్పెషల్ డ్రైవ్ ద్వారా రీజినల్ ట్రాన్స్పోర్టు శాఖ ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామని అన్నారు. డాక్టర్ సాయిచంద్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ముఖానికి తగిలిన గాయాలకు గాను మేఘన దంత వైద్య కళాశాలలో అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక పరికరాలతో చికిత్స నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో అని నృత్య ప్రదర్శన ద్వారా విద్యార్థులు తెలియజేశారు.

    ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఎస్. జయ్ రామ్, ప్రొబేషనరీ ఐపీఎస్ బి. చైతన్య రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ టి. నారాయణ, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, హోమ్ గార్డ్సు ఏసీపీ పి.ఆరుణ్ కుమార్, ట్రాఫిక్ సీఐ వెంకట్ నారాయణ, ట్రాఫిక్ ఆర్ఐ సతీష్, డా.కళ్యాణ చక్రవర్తి ( వైస్ ప్రిన్సిపాల్), డా. అమర్నాథ్​ (హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు), డా.ప్రవీణ్ కుమార్ (హెడ్ ఆఫ్ ది డిపార్డుమెంటు ), డా.శోభారాణి ( ప్రొఫెసర్), డా.సాయిచంద్ ( అసోసియేట్ ప్రొఫెసర్) రమణరావ్ ( ఏఓ), ఐ రాడ్ మేనేజర్ ఎమ్. వర్షా నిహంత్ తదితరులు పాల్గొన్నారు.


Similar News