నిజామాబాద్ బీజేపీ అడ్డా అని ప్రజలు నిరూపించారు..
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా అర్బన్ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవకుడిగా పనిచేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా అర్బన్ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవకుడిగా పనిచేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీ నర్సయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ అర్బన్ లో భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించిన ఇందూర్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అధికార పార్టీ, కాంగ్రెస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఇందూర్ గడ్డ బీజేపీ అడ్డా అని ప్రజలు నిరూపించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి.. నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రోడ్లు, డ్రైనేజీ, ఆసుపత్రులు నగరంలోని ప్రధాన సమస్యల పై దృష్టి సారిస్తానన్నారు.
కేంద్రంలో మూడో సారి మోడీ ప్రభుత్వం వస్తదని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో నాయకులను ఒప్పించి.. అధిక నిధులను తీసుకువచ్చి అర్బన్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానన్నారు. అర్బన్ లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజల చిరాకాల వాంఛ అయిన సొంతింటికలను నెరవేరుస్తానన్నారు. ఇల్లు లేని నిరుపేద మహిళలకు ఇల్లు ఇస్తానన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి.. యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా కార్యక్రమాన్ని చేపడుతానని చెప్పారు. ఈ విజయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నుంచి కింది స్థాయి కార్యకర్తల, ప్రతి నాయకుడి విజయమని అందరి కృషితో గెలుపు సాధ్యమైందన్నారు. తన విజయానికి సహకరించిన అర్బన్ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలాం రాజు, ఎర్రం సుధీర్, రోషన్, మధు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.