పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పార్టీలు సహకరించాలి

రాబోవు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు.

Update: 2024-01-10 16:30 GMT

దిశ, కామారెడ్డి : రాబోవు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీలతో స్పెషల్ సమ్మరి రివిజన్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికలకు ముందు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదుకు అవకాశం కల్పిస్తూ భారత ఎన్నికల సంఘం స్పెషల్ సమ్మరి రివిజన్ నిర్వహిస్తుందని అన్నారు. ఫిబ్రవరి 8 న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్టు తెలిపారు. ఆ లోగా కొత్తగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు ఒక మాసం అవకాశముందని అన్నారు. ఆ తరువాత కూడా నామినేషన్ రోజు వరకు ఓటరు నమోదుకు అవకాశమున్న అనుబంధ జాబితా వెలువడుతుందని, ఇదే అవకాశంగా ప్రతి పోలింగ్ బూత్​ స్థాయిలో ఏజెంట్ లను నియమించి ముసాయిదా ఓటరును పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు.

    ఇటీవలే శానసభ ఎన్నికలు ముగిసిన దరిమిలా ప్రజలకు పోలింగ్ కేంద్రాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉందని, కాబట్టి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల మార్పులు చేపట్టవద్దని ఎన్నికల సంఘం సూచిందని, మన జిల్లాలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1450 మంది ఓటర్లకు మించి లేనందున యథావిథిగా పాత పోలింగ్ కేంద్రాలలోనే ఎన్నికలు నిర్వహింపబడతాయని స్పష్టం చేశారు. గత శాసన సభ ఎన్నికల సందర్భంగా గుర్తించిన అంశాలను పరిగణలోకి తీసుకొని డూప్లికేట్ ఓటర్లను, చనిపోయిన ఓటర్లను, సిమిలర్ ఫొటో ఎంట్రీ, డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీ ఓటర్లను గుర్తించామని, వారికి స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఇచ్చి తొలగిస్తామన్నారు. వివిధ పోలింగ్ కేంద్రాలలో ఉన్న ఒకే కుటుంబం వారు బయటికి వెళ్లారా, ఉన్నారా గుర్తించి వారి అంగీకారంతో ఈ నెలాఖరు నాటికి ఒకే పోలింగ్ కేంద్రానికి షిఫ్ట్ చేయుటకు బూత్​ స్థాయి అధికారులు సమాయత్తంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 20, 21 తేదీల్లో స్పెషల్ క్యాంపైన్ నిర్వహిస్తున్నామని,

     పోలింగ్ కేంద్రాలలో బూత్​ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు నిర్ణీత ఫారాలలో దరఖాస్తు చేసుకునేలా చూడాలని, వాటన్నింటిని ఫిబ్రవరి 2 లోగా పరిష్కరించి 8న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని అన్నారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,29,005 మంది పురుషులు, 3,48,112 మంది మహిళలు, 34 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ అభ్యర్థులు ప్రచార నిమిత్తం ఉపయోగించే టెంట్ సామాగ్రి, లౌడ్ స్పీకర్ లైటింగ్, వాహనాలు, క్రాకర్లు, డెకరేషన్ మెటీరియల్, ఫ్లెక్సీలు, పోస్టర్లు , కరపత్రాలు తదితర వాటికి నిర్థారించిన రేట్ కార్డు జాబితాను రాజకీయ పార్టీ లకు అందజేశారు. ప్రచారం సందర్భంగా ఒక ఎల్ఈడీ స్క్రీన్ ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మదన్ లాల్ జాదవ్, అవధూత నరేందర్, ఖాసిం అలీ, బాటనికి బాలరాజ్, అనిల్ కుమార్, ఎలక్షన్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్, ఎన్నికల సిబ్బంది జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


Similar News