ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా చూడాలి

ప్రశాంత వాతావరణంలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు.

Update: 2024-04-10 11:58 GMT

దిశ, కామారెడ్డి క్రైమ్ : ప్రశాంత వాతావరణంలో పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి ,అదనపు ఎస్పీ నరసింహారెడ్డి లతో కలిసి నోడల్ అధికారులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అనుమతులు, ఫిర్యాదులపై స్పందించుట, అక్రమ డబ్బు, మద్యం, కానుకల వంటివి స్వాధీనపరుచుకొనుట, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థి చేసే ప్రతి ఖర్చు లెక్కలో చూపించాల్సి ఉంటుందని అన్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో ప్రధానంగా ముందస్తుగా అనుమతులు లేని వాహనాలు, సభలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్ లతో పాటు డబ్బు, మద్యం, బహుమతులు తరలించుటపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కోడ్ ఉలంఘన, అక్రమ డబ్బు, మద్యం తరలింపులపై కేసులు నమోదు చేసి రోజు వారి నివేదికలు సమర్పించాలని సూచించారు.

     సి విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు సమాచారమందించాలని, కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని అన్నారు. ట్విట్టర్, పేస్ బుక్, వాట్స్ ఆప్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాద్యమాలలో వస్తున్న అసత్య వార్తలకు తక్షణమే స్పందించి అట్టి వార్తలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. చెల్లింపు వార్తలపై దృష్టిపెట్టాలని, కరపత్రాలు, ఫ్లెక్సీలు వంటివి ముంద్రించే విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 127-ఏ సూచనలు పాటించాలన్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనలు, ప్రచార అంశాలు, ఎల్ఈడీ డిస్​ప్లే తదితర వాటికి ఎంసీఎంసీ ద్వారా అనుమతులు జారీ చేయాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే డివిజన్ ల వారీగా ఈవీఎంలను క్లోస్డ్ కంటైనెర్ లో తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు వేసే విధానంపై పట్టణ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసు సిబ్బంది తదితరులకు అవసరమైన వాహనాలు సిద్ధం చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ప్రక్రియ సోమవారం నాటికి పూర్తిచేయాలన్నారు.

    ఎన్నికల విధులు కేటాయించిన వారికి ఎలాంటి మినహాయింపు లేదని, హాజరు కానీ వారికి షో కాజ్ నోటీసులు జారీచేస్తామని, ఉద్యోగులు ఎవ్వరూ రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు తదితర కార్యక్రమాలలో పాల్గొనరాదని హెచ్చరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వికలాంగుల కోసం వీల్ చైర్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహణ పై ప్రకటన వెలువడిన నాటి నుండి నేటి వరకు 50 లక్షల నగదుతో పాటు 41 లక్షల విలువగల మద్యం స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా గోపాల్ జి తివారి, పోలీసు పరిశీలకులుగా దీపక్ భార్గవ్ ను ఎన్నికల కమిషన్ నియమించిందని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో నోడల్ అధికారులు వరదా రెడ్డి , శ్రీనివాస్, అంబాజీ, శ్రీనివాస్ రెడ్డి, రాజారామ్, ఏఓ మసూర్ అహ్మద్, ఎన్నికల పర్యవేక్షకులు ప్రేమ్ కుమార్, ఇందిరా ప్రియదర్శిని, జ్యోతి, స్వప్న, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News