Sri Ram Sagar : 61 వసంతాల శ్రీ రామ సాగరం..
23 ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఖమ్మం, నల్గొండ జిల్లాలకు తాగు, సాగునీరు అందిస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 61 వసంతాలు పూర్తికానుంది.
దిశ, బాల్కొండ : 23 ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఖమ్మం, నల్గొండ జిల్లాలకు తాగు, సాగునీరు అందిస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 61 వసంతాలు పూర్తికానుంది. 1963 జూలై 26న అప్పటి మాజీ ప్రధాని కీర్తిశేషులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆనాడే ప్రాజెక్టులను దేవాలయాలుగా నెహ్రూ కీర్తించారు. 1963 సంవత్సరంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమై 1983లో పూర్తి అయ్యాయి. ఇంజనీర్ల మేధస్సును రంగరించుకున్న ఎస్సారెస్పీ శ్రీరామ్ సాగర్ జలాశయం 1093.00 అడుగులు (112 టీఎంసీల) సామర్థ్యంతో రెండు జిల్లాలు అయిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిని ఒడిసి పట్టి నిర్మాణం చేపట్టారు.
36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు.. 175 చదరపు మీటర్ల విస్తీర్ణంతో గోదావరి నది జన్మస్థానానికి 326 చదరపు మైళ్ళ దూరంలో సముద్ర మట్టానికి 1100 అడుగుల ఎత్తులో జాతీయ రహదారి 44 (గతంలో 7) దగ్గర 3.2 కిలోమీటర్ల పై భాగాన, 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్, 25 కిలోమీటర్లు ఉన్నా నిజామాబాద్ సరిహద్దు వద్ద ఆనకట్టను నిర్మించారు. వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అనువైన సువిశాలమైన బండరాయిని ఎంచుకొని.. ప్రాజెక్టును 140 చదరపు అడుగుల ఎత్తుతో 3143 అడుగుల పొడవుతో రాతికట్టడం, 125 అడుగుల ఎత్తుతో 475 అడుగుల పొడుగుతో మట్టి కట్టడంతో మొత్తం 47,893 అడుగుల ఆనకట్ట (డ్యాం) నిర్మాణం చేపట్టారు. అలాగే 2,510 జలధారితో 25,425 క్యాచ్ మెంట్ ఏరియాతో 16 లక్షల క్యూసెక్కుల భారీ వరద నీటిని ఇంజనీర్లు వారి మేదస్సును రంగరించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి ప్రాజెక్టుకు 42 వరద గేట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వరదలు వచ్చే సమయంలో వచ్చే బురద మట్టిని తొలగించే విధంగా 6 గేట్లు నిర్మించారు. ప్రాజెక్టుకు వారి మేధస్సును ఉపయోగించి ఆధునిక దేవాలయాన్ని నిర్మించారు.
పోచంపాడు డ్యాం నిర్మాణానికి రూపకల్పన..
తాగు, సాగునీరు అందించాలనే మహత్తర ఆశయంతో అప్పట్లో ఇంజనీర్లు మానేరు వ్యాలీ అనే భారీ ప్రాజెక్టు నిర్మించాలని సంకల్పించారు. దాదాపు 400 టీఎంసీ 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నారు. దీనికోసం 1944 - 49 సంవత్సరం మధ్యలో అప్పటి పాలకులు ఈ పెద్ద పథకానికి రూపకల్పన చేశారు. అప్పటి నిజాం సర్కార్ పతనం కావడంతో ప్రాజెక్టు ప్రతిపాదన అటకెక్కింది. ఇలా పలుమార్లు రూపాంతరం చెందుతూ పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత 1957-58 సంవత్సరంలో ప్రభుత్వం మరోసారి చేసి గోదావరి నది పై ఉమ్మడి బాల్కొండ పోచంపాడు వద్ద నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. నిర్మాణానికి లోక్ సభలో 1963లో ప్రకటన చేశారు. 40.10 కోట్ల వ్యయం అంచనాతో నిధులు మంజూరు చేసి పనులు 1963 జూలై 26న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 1600 కోట్ల పైగా వ్యయం పెరిగిందని అధికారులు తెలుపుతున్నారు.
నిర్మాణం నాటి నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులు..
1963 సంవత్సరంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. కాకతీయ కాలువ పనులు 1970 నాటికి 30 కిలోమీటర్లు పూర్తి కావడంతో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు . 1983 వ సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి పనులను పూర్తి చేసుకుంది. అదే సంవత్సరం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువలకు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. అదేవిధంగా ఆ సంవత్సరంలో భారీగా వరదలు వచ్చి ప్రాజెక్టులు చేరుతుండడంతో దిగువ గోదావరిలోకి 42 వరద గేట్లను ఎత్తి మిగులు జలాలను ఎలాంటి హెచ్చరికలు లేకుండా వదిలేయడంతో గోదావరి తీర ప్రాంతాలలో ఉన్న గ్రామాల పంట పొలాలు, పశువులు ఇండ్లు కొట్టుకుపోయి తీరని శోకాన్ని మిగిల్చింది.
అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలను అంచనా వేసి నీటి విడుదలను చేపట్టారు. 1993 సంవత్సరంలో జూన్ 30 వ తేదీన వరద కాలువకు ప్రధాని పీవీ నరసింహారావు వరద కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదతో మట్టి కొట్టుకు వచ్చి పూడిక నిండి ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలకు తగ్గిపోయింది. నాలుగు కాలువలకు 16 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తున్నారు. ప్రాజెక్టులో పూడిక పేరుకు పోవుతుండడంతో సాగునీరు తగ్గి ఆయకట్టు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.