MLA: రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని మరోసారి రుజువయిందని, రైతును రాజు చేయడానికే ఈ బడ్జెట్ ను రూపొందించారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-25 12:22 GMT

దిశ, దేవరకద్ర: మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని మరోసారి రుజువయిందని, రైతును రాజు చేయడానికే ఈ బడ్జెట్ ను రూపొందించారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర వివక్షత ,గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్ ను రూపొందించిన డిప్యూటీ, సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తొలి వాస్తవిక బడ్జెట్ అని అన్నారు. బడ్జెట్ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. ఈ బడ్జెట్ రైతుల బడ్జెట్ అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని మరోసారి రుజువైందని తెలిపారు.

రైతును రాజు చేసే దిశగా బడ్జెట్ తయారు చేశారని, ఏకంగా రూ. 72,659 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగానికి కేటాయింపులు చేశారన్నారు. రుణమాఫీకి 31 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికీ అమలు చేసిన మహాలక్ష్మి, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం , ఉచిత విద్యుత్, రూ.500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా మొదలగు పథకాలు అన్నిటికి సరిపడే నిధులను ఈ బడ్జెట్లో కేటాయించారని అన్నారు. ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించి భారీ అప్పులు తెచ్చి విధ్వంసం చేసిందని, గడిచిన పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ అప్పు పది రెట్లు పెరిగిందని తెలిపారు.

మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో గత ప్రభుత్వం తెచ్చిన అప్పులు వడ్డీలతో కలిపి రీపేమెంట్ చేశామని, ప్రభుత్వం తీసుకున్న అప్పు కంటే చెల్లించిన చెల్లింపులె ఎక్కువ అని అన్నారు. బడ్జెట్ పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్న కేసీఆర్ తన ప్రభుత్వంలో దళిత బంధుకు 17వేల కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే దళితులను మోసం చేశారని తెలిపారు. బడ్జెట్ గురించి మాట్లాడే హక్కు మాజీ ముఖ్యమంత్రి కి లేదని ఆయన మాటలను ఖండిస్తున్నామని అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి , ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.


Similar News