మాదకద్రవ్యాలు గంజాయి, బెల్ట్ షాపులపై త్వరలో ఉక్కుపాదం.. మంత్రి జూపల్లి

మాదకద్రవ్యాలు, గంజాయి, బెల్ట్ షాపుల పై కల్లులో కలిపే ఆల్పోజోమ్ సరఫరాదారుల పై త్వరలో ఉక్కు పాదం మోపనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Update: 2024-09-30 16:38 GMT

దిశ, ఆర్మూర్ : మాదకద్రవ్యాలు, గంజాయి, బెల్ట్ షాపుల పై కల్లులో కలిపే ఆల్పోజోమ్ సరఫరాదారుల పై త్వరలో ఉక్కు పాదం మోపనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. నూతన భవనానికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి జూపల్లి ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాల రవాణా ఏవిధంగా కొనసాగుతుంది, దాన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని జిల్లా స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో అతి తక్కువగా కేసులు నమోదు కావడం పట్ల మంత్రి జూపల్లి జిల్లాస్థాయి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట వ్యవస్థలో ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు పనులు చేస్తున్నారా లేదా అని కేసుల నమోదు పై మంత్రి జూపల్లి మండిపడ్డారు. జిల్లాలో కేసులు తక్కువగా నమోదు కావడం సరికాదని, రాష్ట్ర స్థాయి నుంచి ప్రత్యేక టీంని జిల్లాకు తనిఖీలు చేసేందుకు పంపించిన సందర్భంలో ఎక్కువ స్థాయిలో కేసులు నమోదు అయితే గనక జిల్లా అధికారుల పై చర్యలు తీసుకుంటానని మంత్రి జూపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు వారదులుగా పని చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి పొలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని, కల్తీకల్లుకు బానిసలైన యువత విదేశాలకు వెళ్లి మృతి చెందడం గానీ, జైలు పాలు కావడం గాని జరుగుతుందని అన్నారు.

ఇలాంటి కల్తీ కల్లు నివారించాలని మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి జూపల్లి ఇందుకు సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పైడి రాజేష్ రెడ్డికి హామీ ఇచ్చారు. అనంతరం ఎక్సైజ్ శాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్లో గత ఎన్నో సంవత్సరాలుగా అద్దె భవనంలో సాగుతున్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల భూపతిరెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ లో చైర్మన్లు మార గంగారెడ్డి, సుంకేట అన్వేష్ రెడ్డి, తాహిర్ బిన్ హుందాన్, ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ జిల్లా స్థాయి అధికారులు, ఆర్మూర్ ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


Similar News