మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించండి

చెరుకు ఉత్పత్తి దారుల సంఘం,రైతు ఉత్పత్తి దారుల సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కే ఎం ఎస్) ఆధ్వర్యంలో రైతు సదస్సు స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు.

Update: 2024-02-13 13:21 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : చెరుకు ఉత్పత్తి దారుల సంఘం,రైతు ఉత్పత్తి దారుల సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కే ఎం ఎస్) ఆధ్వర్యంలో రైతు సదస్సు స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ చెరుకు రైతు వేదిక కన్వీనర్ తుల రాజేందర్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద పేరు పొందిన బోధన్ చక్కెర ఫ్యాక్టరీ గత పాలకుల తప్పుడు విధానాల మూలంగానే మూత పడిందని అన్నారు. ఈ ఫ్యాక్టరీకి 16 వేల ఎకరాల విస్తీర్ణ గల భూమి ఉండగా నాటి పాలకుల రైతు వ్యతిరేక విధానాల వల్ల అది మూతపడడంతో రైతులు ఆ భూములను కోల్పోయారని తెలిపారు.

     సారంగాపూర్ ఎన్సిఎఫ్ సహకార రంగంలో ఉన్న ఏకైక చక్కెర ఫ్యాక్టరీని గత పాలకుల పార్టీల వారు ఆక్రమించుకోవడానికి కుట్న పన్నుతున్నారని, వీరి కుట్రలకు వ్యతిరేకంగా చెరుకు రైతాంగం అప్రమత్తంగా ఉండి ఫ్యాక్టరీని కాపాడుకోవాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం ఫ్యాక్టరీలను తెరిపించేందుకు సబ్ కమిటీ వేసిందని, తక్షణమే సబ్ కమిటీ ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఫ్యాక్టరీలను తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీల పునరుద్ధీకరణకు రైతులు పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

     ఈ సదస్సులో ఫ్యాక్టరీలపై ఉన్న అప్పులన్నీ మాఫీ చేసి తక్షణమే తెరిపించాలని సదస్సులో ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈ సదస్సులో చెరుకు ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ,అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, ఎఫ్బీఓ చైర్మన్ పృథ్వీరాజ్, నాగయ్య, శ్రీనివాసు, వినయ్ కుమార్ ,రైతు నాయకులు బొడ్డు గంగారెడ్డి ,సంతోష్ ,రాజారెడ్డి ,ప్రసాద్ ప్రముఖ కవి ప్రసాద్ ,గంగన్న దాసు , జేపీ గంగాధర్, శ్రీనివాస్ ,మోహన్, రాజేశ్వర్, వంశీ భారతి ,దేవిక, తదితరులు పాల్గొన్నారు.


Similar News