Weather update: పలకరించిన తొలకరి.. మూడురోజుల పాటు వర్షాలు..

నైరుతి రుతుపవానాలు ఆలస్యంగా తొలకరిని పలకరించింది.

Update: 2023-06-24 14:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నైరుతి రుతుపవానాలు ఆలస్యంగా తొలకరిని పలకరించింది. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జూన్ 4న నైరుతి రుతుపవనాలు ప్రవేశించేవి. ఈసారి వాతావరణ శాఖ ఆలస్యంగా జూన్ 8న ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయని తర్వాత 19న పడుతాయని సూచనలు చేసినా చుక్క చినుకులు పడలేదు. ఎట్టకేలకు ఈ నెల 22న వర్షాలు కురియడంతో రైతుల్లో హర్షం వ్యక్తమౌతుంది. దాదాపు పక్షం రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు పలుకరించినట్లయింది. రోహిణి కార్తె తర్వాత కురియాల్సిన వర్షాలు మృగశిర కార్తె తర్వాత కూడా జాడలేక ఆరుద్ర కార్తెతో పడ్డాయని రైతులు చెబుతున్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారులు జిల్లాలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రకటన చేయడం హర్షం వ్యక్తమౌతుంది.

నిజామాబాద్ జిల్లాలో వర్షాకాలంలో 5 లక్షల 12 వేల ఎకరాల్లో పంటలు పండిస్తారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. వర్షాలు ఆలస్యంగా కురువడంతో ఇప్పటికే వేసిన నారుమళ్ళు ఎండిపోయాయి. మరో దఫా రైతులు నారును అలికే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 4 లక్షల 17 వేల ఎకరాల్లో వరి, 60 వేల ఎకరాల్లో సోయా, 25 వేల ఎకరాల్లో మక్క, 35 వేల ఎకరాల్లో పసుపు మిగితా మినుములు, పెసర పంటలు పండిస్తారని చెబుతున్నారు. వర్షాలు ఆలస్యంగా కురువడంతో పంటలు ఆలస్యంగా విత్తిన సమయానికి చేతికందుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ వరి పంటను పండించేందుకు అనుకూలంగా వాతావరణం ఉందని తెలిపారు.

తెలంగాణ సోనగా పేరున్న ఆర్ఎన్ఆర్ 15048 వరి విత్తనాలను విత్తితే 125 రోజుల్లో పంట చేతికొస్తుందని అన్నారు. సోయా పంట నెలాఖరు వరకు విత్తుకోవచ్చని తెలిపారు. మక్కలు జులై 15 వరకు విత్తవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో గడిచిన వానాకాలంలో 59 వేల యూరియా వినియోగం జరిగిందని, ఇప్పటికి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. మొత్తానికి ఈ సీజన్ కోసం లక్ష మెట్రిక్ టన్నుల సరిపడ ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంటను పండిస్తారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి రెండు రోజుల క్రితమే రాష్ట్ర శాసనసభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటి విడుదలను అధికారికంగా ప్రారంభించారు. నిజాంసాగర్ కింద కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో లక్షా 80 వేల ఎకరాల సాగు జరుగుతుంది. నిజాంసాగర్ లో ప్రస్తుతానికి 4.551 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధాన కాలువ ద్వారా 1505 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు పంటలు పండించే కార్యక్రమం షురూ అయింది.

ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరు గాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల మాత్రం ఇప్పటికి ప్రారంభించలేదు. నిజామాబాద్ రైతుల హక్కుగా పరిగణించే లీకేజీల నీటినైనా వదులాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 20.068 నీరు నిల్వ ఉంది. వర్షాలు ఆలస్యంగా కావడంతో కనీసం ప్రాజెక్టు నుంచి అయినా నీటిని విడుదల చేసేందుకు నీటి విడుదలకై జలవనరుల శాఖ సమీక్షా సమావేశం జరుపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిజాంసాగర్ ఆయకట్టు కింద మాత్రమే పంటలు విత్తడానికి నీటి విడుదల చేసిన అధికారులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలపై పాలకులు, అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు మూటగట్టుకున్నాయి.

Tags:    

Similar News