MEO : పాఠశాలల బలోపేతానికి ఎంఈవోలకు ఒకరోజు శిక్షణ..
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది.
దిశ, కామారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే బదిలీలు, పదోన్నతులు, డీఎస్సీ నియామకాల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే ప్రతి మండలానికి ఎంఈవోను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని కొమురంభీం ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్‌లో శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో రాజు తెలిపారు. కామారెడ్డి జిల్లా నుంచి 25 మంది ఎంఈవోలు శిక్షణకు వెళ్లారు.
పర్యవేక్షణకు ప్రాధాన్యం..
ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 1 – 5వ తరగతుల విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) పేరుతో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లోని 6 – 9వ తరగతుల విద్యార్థులకు అభ్యసనాభివృద్ధి కార్యక్రమాన్ని ఉన్నతి పేరుతో అమలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో సక్రమంగా అమలయ్యేలా ఎంఈవోలు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ వివరాలను పాఠశాల విద్యాశాఖ యాప్‌లో నమోదు చేయడంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అప్పట్లో ఒక్కో ఎంఈవోకు రెండు నుంచి ఆరు మండలాలకు అదనపు బాధ్యతలు ఉండడంతో సరైన పర్యవేక్షణ చేయలేకపోయారు. పాఠశాలల పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలన విధానం తదితర అంశాల పై ఎంఈవోలకు ఉన్నతాధికారులు ఒకరోజు శిక్షణ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.