మినీ పాకిస్తాన్ గా ఓల్డ్ సిటీ

దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా దొంగలు ఓల్డ్ సిటీలోనే ఉంటారని, ఓల్డ్ సిటీ మొత్తం మినీ పాకిస్తాన్ గా మారిపోయిందని, తీవ్రవాదులకు మజ్లీస్ సోదరులు ఆర్థికంగా సహకరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

Update: 2023-11-26 12:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా దొంగలు ఓల్డ్ సిటీలోనే ఉంటారని, ఓల్డ్ సిటీ మొత్తం మినీ పాకిస్తాన్ గా మారిపోయిందని, తీవ్రవాదులకు మజ్లీస్ సోదరులు ఆర్థికంగా సహకరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే టెర్రరిస్టులకు సపోర్టు చేసే వారి ఇంటికి బుల్డోజర్లు వస్తాయని అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో గోల్ హనుమాన్ చౌరస్తాలో బీజేపీ కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజాసింగ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఒక్కటేనని ఆరోపించారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ గెలవద్దని షబ్బీర్ అలీని బరిలో ఉంచారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీకే పోటీ అని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వెళుతుందన్నారు. 2014న ఒక మోసగాడు గెలిచాడని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేశాడా అని ప్రశ్నించారు. అప్పుడు బీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు బార్ అండ్​ రెస్టారెంట్ పార్టీ పెట్టాడని, 2014,18లో మోసం చేశాడని, ఇప్పుడు మోసం చేయడానికి అవకాశం లేదని నిరూపించాలన్నారు. నగరం 1500 కోట్లతో అభివృద్ధి జరిగిందని అంటున్నారని 1500 కోట్లు ఎక్కడ పెట్టుకున్నారన్నారు.

    తండ్రి కాళేశ్వరంలో చేస్తే కొడుకు అక్కడ ఇక్కడ కలెక్షన్ చేస్తున్నాడని, కూతురు లిక్కర్లో కలెక్షన్ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనేనని, అయ్య మోసగాడు అంటే కొడుకు ఇంకా పెద్ద మోసగాడని విమర్శించారు. అందరూ బయట అబద్ధాలు ఆడతారు కానీ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడతారన్నారు. తెలంగాణలో ఐదు లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. బంగారు తెలంగాణ చేయలేదని, నిరుద్యోగుల తెలంగాణ చేశాడన్నారు. అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీఆర్​ఎస్ సర్కార్ స్టీరింగ్ తన ఇద్దరు బామ్మర్దుల చేతుల్లో ఉందని స్వయానా ఓవైసీ బ్రదర్స్ చెప్పారు అన్నారు. ఎంఐఎం వారు కలిసుంటే మతకల్లోలాలు జరగవని కేసీఆర్ , కేటీఆర్ వాళ్ల కాళ్లు మొక్కి వారిని తమవద్ద ఉంచుకుంటున్నారు అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ధన్ పాల్ సూర్యనారాయణకు ఇచ్చే గుణం ఉంది కానీ తీసుకునే గుణం లేదన్నారు.

    నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గణేష్ గుప్త కరెప్షన్ లో ఆరితేరిపోయాడన్నారు. కరెప్షన్ కావాలో డెవలప్ మెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఈ సందర్బంగా బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి అని చెప్పుకొని ఓట్లు అడిగే నాయకులు మనకు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీ ల కు బుద్ది చెప్పాలని అన్నారు . తాను కష్ట పడి ఒక్కో మెట్టు ఎక్కి పైకి వచ్చానని తెలిపారు. తన లక్ష్యం ఇందూరు ప్రజలకు అండగా ఉండి వారి బాధలను తీర్చడమే అన్నారు. ఈ ఎన్నికలో తనని గెలిపిస్తే ఎమ్మెల్యే గా వచ్చే జీతాన్ని కూడా పేద విద్యార్థుల చదువుకు ఉపయోగిస్తా అన్నారు. ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటు వేసి తనని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో అర్బన్ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ , జిల్లా అధ్యక్షులు లక్ష్మీనర్సయ్య, నగర అధ్యక్షులు పంచరెడ్డి లింగం, ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News