భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి...

ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-03 09:22 GMT

దిశ, ఆర్మూర్ : ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ లతో కలిసి మంగళవారం సందర్శించారు. ఆర్మూర్ ఏరియా అధికారులైన ఆర్మూర్ ఎసీపీ గట్టు బస్వారెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజులతో భారీ వర్షాల పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న సందర్భంగా లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండి ఉంటాయని, అక్కడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు వేగవంతంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేపట్టాలన్నారు.

వరద ప్రాంతాల్లో ఇంజనీరింగ్, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. పురాతన శిథిలావస్థలో ఉన్న కుటుంబాలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 90 శాతం వరకు నిండిందని, శ్రీరామ్ సాగర్ నది పరివాహకం ప్రాంతంలో సోమవారం చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం రక్షించారని బోధన్ ఎమ్మెల్యే చెప్పారు. తప్పనిసరి అవసరం ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు సుంకేట అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హుందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, వన్నెల్ దేవి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Similar News