రాత్రికి రాత్రే డబుల్ బెడ్​ రూం ఇళ్ల కబ్జా

రాత్రికి రాత్రి కొందరు నిరుపేదలు డబుల్ ఇండ్ల వద్దకు చేరుకొని తాళాలు వేసి కబ్జా చేయడంతో పేదల మధ్య చిచ్చు పెట్టినట్లు అయింది.

Update: 2024-02-02 09:19 GMT

దిశ, భిక్కనూరు : రాత్రికి రాత్రి కొందరు నిరుపేదలు డబుల్ ఇండ్ల వద్దకు చేరుకొని తాళాలు వేసి కబ్జా చేయడంతో పేదల మధ్య చిచ్చు పెట్టినట్లు అయింది. ప్రభుత్వం అధికారికంగా లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయకపోయినప్పటికీ లిస్టులో తమ పేరు ఉందన్న ఉద్దేశంతో తాళాలతోపాటు, సామగ్రినంతా తీసుకొని గృహప్రవేశాలు చేయడం శుక్రవారం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మొన్న పెద్ద మల్లారెడ్డి లో ఇదే విధంగా గృహప్రవేశాలు చేయగా తాజాగా భిక్కనూరు మండలం బస్వాపూర్ లో సేమ్ సీన్ రిపీట్ కావడం అధికారులకు తలనొప్పిగా మారింది. 44వ జాతీయ రహదారి నుంచి పెద్ద మల్లారెడ్డి వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి

     ఆలయం సమీపంలో బస్వాపూర్, సిద్ధ రామేశ్వర్ నగర్ గ్రామాల పేదల కోసం 50 డబుల్ బెడ్​ రూం లు కట్టారు. అయితే బస్వాపూర్ గ్రామానికి చెందిన కొందరు పేదలు గ్రామానికి చెందిన ఎవరో ఒక నేత చెప్పారనే ఉద్దేశంతో గురువారం రాత్రి డబుల్ ఇండ్ల వద్దకు చేరుకొని కబ్జా చేసి తాళాలు వేసుకొని వచ్చారు. ఈ విషయం మిగతా నిరుపేదలకు తెలియడంతో పాటు సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో కూడా తెలియడంతో రాత్రికి రాత్రి వారు కూడా పొద్దుపోయే వరకు వంట సామగ్రిని తీసుకొని వచ్చి చూసేసరికి ఇండ్లన్నింటికీ తాళాలు వేసి ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక వెనక్కి వెళ్లిపోయి తెల్లవారుజామున అక్కడికి చేరుకున్నారు. మరికొందరైతే కబ్జా చేసిన ఇంటికి పేర్లు కూడా రాసేసుకున్నారు.

    తాళాలు వేసిన విషయం తెలియక మరి కొంతమంది నిరుపేదలు ఈరోజు అక్కడికి చేరుకునేసరికి అన్ని గదులకు తాళాలు వేలాడుతూ కనిపించాయి. దీంతో కొందరు తాళాలు పగలగొట్టి అందులో ప్రవేశం చేయాలని చూడగా తాళాలు ఎలా పగలగొడతావ్ అంటూ గదికి తాళాలు వేసిన వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మరికొందరు కుస్తీపట్లు పట్టి రచ్చ రచ్చ చేశారు. కొందరైతే దర్వాజలకు మామిడి తోరణాలు కట్టి గృహప్రవేశాలు చేయడం గమనార్హం. బస్వాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి గంగ మణి తాను కబ్జా చేసి తాళం వేసుకుందామంటే ఒక్క గది కూడా ఖాళీ లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను గరీబ్ దాన్నని, ఇల్లు జాగలేదని పేర్కొంది. తనకు డబుల్ ఇల్లు ఇవ్వకపోతే తాను తన కొడుకు ఇప్పుడే విషం తాగి చస్తామంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

మా గ్రామానికి కేటాయించిన వాటికి వాళ్లు తాళాలు వేస్తారా...?

సిద్ధ రామేశ్వర నగర్ గ్రామానికి కేటాయించిన 8 డబుల్ బెడ్ రూం ఇండ్లను కూడా వదలకుండా తాళాలు వేస్తారా...? ఇదెక్కడి అన్యాయం అంటూ నిరుపేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే వంట వార్పుతో ఆందోళనకు దిగుతామని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయమై తాజా మాజీ సర్పంచ్ జనగామ శ్రీనివాస్ కు, తహసీల్దార్ కప్పగంతుల శివప్రసాద్ కు శుక్రవారం ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు.

ఖాళీ చేయాలని పోలీసుల ఆదేశం...

డబుల్ బెడ్ రూమ్ లకు తాళాలు వేసుకున్నారన్న విషయం తెలిసి స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ఖాళీ చేసి వెళ్లాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు పేదలు చెబుతున్నారు. అయితే సామగ్రితో వచ్చినవారు లోపల పెట్టిన సామగ్రిని తిరిగి వెనక్కి తీసుకొస్తున్నప్పటికీ, వారు కోరుకున్న గదికి మాత్రం తాళాలు వేసి వెళ్తున్నారు.

అలాట్ చేయకముందే చేరితే కేసులు : తహసీల్దార్ కప్పగంతుల శివప్రసాద్

అలాట్ చేయకముందే డబుల్ బెడ్రూం ఇండ్లలోకి చేరితే కేసులు నమోద వుతాయని తహసీల్దార్ కప్పగంతుల శివప్రసాద్ హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ లు ఆక్రమించుకున్నారన్న విషయం తెలిసే బస్వాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్దకు వెళ్లి వారిని ఖాళీ చేయించి తాళాలు వేయించానన్నారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సిద్ధ

     రామేశ్వర నగర్ గ్రామానికి చెందిన 8 మంది అర్హులు ఉన్నారు. వాటిని కూడా బస్వాపూర్ కు చెందిన వారు కబ్జా చేసి రూములకు తాళాలు వేశారు. పెద్ద మల్లారెడ్డి లో కూడా ఇలాంటి సంఘటననే జరుగగా వాటికీ తాళాలు వేయించి అక్కడ నైట్ వాచ్మెన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.


Similar News