‘భారత్ మాల’కు ఆదిలోనే అడ్డంకులు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి మంచిర్యాలకు వెళ్లే జాతీయ రహదారి 63 లో భాగంగా 25 కిలోమీటర్ల రహదారి జిల్లాలో నిర్మించనున్న విషయం తెల్సిందే.

Update: 2023-05-23 02:11 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి మంచిర్యాలకు వెళ్లే జాతీయ రహదారి 63 లో భాగంగా 25 కిలోమీటర్ల రహదారి జిల్లాలో నిర్మించనున్న విషయం తెల్సిందే. అందులో భాగంగా వేంపల్లి, రెంజర్ల, శెట్పల్లి, తొర్తి, తిమ్మాపూర్, ఏర్గట్ల మీదుగా రహదారి కోసం భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ భూములకు ధర ఎక్కువ. ఎక్కువగా వాణిజ్య పంటలు పండించే రైతుల వ్యవసాయ భూముల ధరలు ఎకరానికి రూ.20 లక్షలుపైగానే ఉంది. ఈ విషయంలో భూములను కోల్పోవడ, రైతులకు సుతారం ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రైతులు జాతీయ రహదారి విషయంలో తమ భూములు తీసుకోవద్దని ఆందోళనకు దిగారు. నాలుగు వరుసల రోడ్లకు భూములు ఇచ్చేది లేదని రాస్తారోకో నిర్వహించారు.

కమ్మర్ పల్లి వద్ద బైపాస్ ద్వారా జాతీయ రహదారి పనులను చేపట్టేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ అనుగుణంగా భూములు ఇచ్చేది లేదని భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతం ఉన్న 63వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా మారిస్తే రోడ్డుకు 75 అడుగుల లోపల ఉన్న కోట్ల విలువ చేసే భవంతులు, దుకాణ సముదాయాలు, ఇల్లు తొలగించే పరిస్థితి ఉంటుందని వాటిని కోల్పోతామని కమ్మర్ పల్లి గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయంలో 200 కుటుంబాలు రోడ్డున పడుతాయని జాతీయ రహదారి విస్తర్ణను వద్దని గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఈ విషయంలో భవన యజమానులు, వ్యాపారస్తులు, దుకాణాదారులు ఎంపీ అర్వింద్ ను, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ఆర్డీవో కు వినతి పత్రం సమర్పించారు.

ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 63వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఖచ్చితంగా జరిగి తీరుతాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మంచిర్యాల కార్యాలయం అధికారి భీంసేన్ రెడ్డి కమ్మర్ పల్లి, ఏర్గట్ల మండలం కు చెందిన రైతులకు జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న వ్యాపారులకు, ఇళ్ల యజమానులకు, దుకాణాదారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. కమ్మర్ పల్లి లో జాతీయ రహదారి విస్తరణ చేయాలా? లేక బైపాస్ నుంచి పనులు చేపట్టాలని వారే నిర్ణయించుకోవాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. కమ్మర్ పల్లి మండల కేంద్రం పరిధిలో ఇది వరకు ఎస్సారెస్పీ వరద కాలువకు రైల్వే లైన్‌కు, హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం కాలువలు, పసుపు పరిశోధన స్థానం మండలాధికారుల కార్యాలయం కోసం వందల ఎకరాల భూములను కోల్పోయామని చెబుతున్నారు.

జాతీయ రహదారి వెడల్పు కోసం బైపాస్ (గ్రీన్ హైవే) ద్వారా రోడ్డు నిర్మాణం చేపడితే వందల ఎకరాల విలువైన పంట భూములు కోల్పోతామని రైతులు చెబుతున్నారు. జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్ హెచ్ఐ) రూపొందించిన అలైన్మెంట్ గ్రామం నుండి వెళ్లే మార్గంలో బడా వ్యాపారులు వ్యతిరేకించి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని తెరపైకి తెస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు ఎన్ హెచ్ ఐ ను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జాతీయ రహదారి సంస్థ అధికారులు కచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని చేస్తామని ప్రకటిస్తుండడంతో కమ్మర్ పల్లి మండలంలో నిర్మాణంపై చిక్కుముడి వీడేలా లేదు.

Tags:    

Similar News