బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్! సోషల్ మీడియాలో ట్రోలింగ్

‘బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్’.. జహీరాబాద్ ఎంపీని విమర్శిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Update: 2024-04-10 01:51 GMT

దిశ, నిజామాబాద్ ప్రతినిధి: ‘బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్’.. జహీరాబాద్ ఎంపీని విమర్శిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన వ్యాపారాలను కాపాడుకునేందుకు రాజకీయాల్లో ఉన్నారనే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. బీబీ పాటిల్ ను విమర్శిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు చేస్తున్న వీడియోలు, కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘పేరుకే కామారెడ్డి జిల్లా వాసి.. పదేళ్లుగా ఎక్కడున్నారు?’ అంటూ నియోజకవర్గ ప్రజలు నిలదిస్తూ స్పందిస్తున్నారు. పార్టీలు మారి ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లడగడానికి వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్ స్టా గ్రాంలో ట్రోలింగ్ చేస్తున్నారు.

పార్టీ మారి మళ్లీ బరిలోకి..

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ కు చేందిన బీబీ పాటిల్ ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా జహీరాబాద్ నుంచి 1.40 లక్షల మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. 2019లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా, ఆరు వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన బీజేపీలోకి జంప్ అయ్యారు. 2024 మార్చిలో బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ దక్కించుకొని మళ్లీ జహీరాబాద్ ఎంపీ బరిలో నిలిచారు. కాగా, వ్యాపారవేత్త అయిన బీబీ పాటిల్ కు బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచే బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

బిజినెస్ పరంగానూ ఆయన రిలేషన్స్ కొనసాగించినట్లు తెలుస్తున్నది. అయితే ఎంపీగా ఎన్నికైనా.. బీబీ పాటిల్ కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యే వారని, ఆయనకు ప్రజలతో నేరుగా సంబంధాలు లేవనే ప్రచారం ఉన్నది. కేడర్ తో నేరుగా రిలేషన్ లేకుండా అప్పటి ఎమ్మెల్యేలు వ్యవహరించారనే చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండరనే అపవాదును బీబీ పాటిల్ మూటగట్టుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

కౌంటర్ ఇవ్వడంలో విఫలం..

తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రం నిధుల నుంచి తెచ్చిన నిధులతో చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ బీబీ పాటిల్ ఓట్లడిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా, నేరుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే వాదనలు ఉన్నాయి. బీజేపీ నేతలు, కేడర్ మద్దతు సైతం కరువైనట్టు కనిపిస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన అనేక మంది బీజేపీ నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు.

కానీ సిట్టింగ్ ఎంపీ వచ్చీ రావడంతోనే టికెట్ దక్కించుకోవడంతో వారు అసంతృప్తికి గురయ్యారు. దీంతో వారు బీబీ పాటిల్ కోసం పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం లేదని తెలుస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోసం పోటీ చేసే వారే నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలుగా ఉండడంతో వారి మద్దతు కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తున్నది. బాన్సువాడ నియోకవర్గంలోని కోటగిరి మండలంలో జరిగిన బీజేపీ సన్నాహక సమావేశంలో బీబీ పాటిల్, ఇతర నాయకుల సమక్షంలోనే విభేదాలు బహిర్గతమయ్యాయి.


Similar News