ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తాం

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Update: 2024-01-17 10:10 GMT

దిశ ప్రతినిధి ,నిజామాబాద్ : ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రానగర్ లో

     ఏర్పాటు చేసిన దివంగత నందమూరి తారకరామారావు విగ్రహాన్ని బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ముందుగా డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామానికి చేరుకున్న మంత్రి తుమ్మలను బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్కల నర్సారెడ్డి, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

     అనంతరం ఆంధ్రానగర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్నిమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ తాము ఎక్కడ ఉన్నా ఏ పదవిలో ఉన్నా రాష్ట్ర రైతాంగ సంక్షేమమే ఎజెండాగా పని చేస్తున్నామని అన్నారు. నందమూరి తారకరామారావు ఆశీస్సులతో రాజకీయాలలోకి వచ్చిన తామంతా, ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా అదే నిబద్ధతతో, నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అమలుకు శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. తెలుగు ప్రజల కీర్తిని దశదిశలా చాటిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రైతాంగ అవసరాలు, కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.

     ఆర్ధిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని, ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్ లో పొందుపర్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు తల దించుకునే పరిస్థితి తలెత్తబోనివ్వమని, ఎప్పటికీ రైతు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నదే తమ సంకల్పమని అన్నారు. ఇప్పటికే రెండెకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని,

     మిగతా రైతులకు కూడా రేపటి నుండే వారి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెలాఖరు లోపు రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు, గ్రామ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News