నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ భర్త బైండోవర్

నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. దండు చంద్రశేఖర్ అధికారాన్ని

Update: 2024-04-10 17:06 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త దండు చంద్రశేఖర్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. దండు చంద్రశేఖర్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిజామాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమంగా మట్టి తవ్వకాల్లో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు బుధవారం నిజామాబాద్ దక్షిణ మండల నాయబ్ తాహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న దండు చంద్రశేఖర్‌ను పోలీసులు రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత నగర మేయర్ దంపతులు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ నాయకుల పార్టీ మార్పిడి కొనసాగుతుండగా మేయర్ భర్తను పోలీసులు బైండోవర్ చేయడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లాలో అక్రమ మైనింగ్‌పై ఉక్కు పాదం మోపాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు బైండోవర్ కార్యక్రమాన్ని చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

నిజామాబాద్ నగరంలోని ప్రస్తుత మేయర్ దండు నీతూ కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న 11వ డివిజన్లొ, పదవ డివిజన్ భూకబ్జాలలో ప్రభుత్వం గతంలో పేదలకు ఇచ్చిన ప్లాట్ల క్రయవిక్రయాల్లో మేయర్ భర్తపై చాలా ఆరోపణలు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని దండు చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే అండదండలతో నిజామాబాద్ నగర్ శివారుతోపాటు మోపాల్ మండలంలో, రూరల్ మండలంలో మట్టి తవ్వకాలను చేశారనేది ప్రధాన ఆరోపణ. దండు నీతు కిరణ్ దంపతులు పార్టీ మారతారని ప్రచారం జరుగుతుండగా ఆయనను బైండోవర్ చేయడంతో రాజకీయంగా ఈ అంశం చర్చనీయమైంది. ఇదిలా ఉండగా ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధానంగా మాకూరు మండలంలో మైనింగ్ మాఫియా గుట్ట గుల్ల చేసిన ఇప్పటివరకు అక్కడ ఒక్క కేసులు గాని అరెస్టులు గాని చేయకుండా నిజామాబాద్ నగరంలో కేవలం తవ్వకాలు జరుపుతున్నారు అన్న అనుమానంతో మేయర్ భర్తను బైండోవర్ చేయడం బీఆర్ఎస్‌తో పాటు అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చర్చకు దారి తీసింది.


Similar News