నిజామాబాద్ ఉద్యోగ జేఏసీ ఉదారత..రూ. 5 కోట్ల విరాళం
జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉదారతను
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రంలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల జేఏసీ ముందుకొచ్చింది. నిజామాబాద్ జిల్లా ఉద్యోగులకు సంబంధించిన ఒకరోజు వేతనం రూ. 5 కోట్లు విరాళంగా ఇస్తూ దానికి సంబంధించిన సమ్మతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ కి జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ అందజేశారు. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ పర్యటనలో భాగంగా బుధవారం నిజామాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ నాయకులు షబ్బీర్ అలీ తో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో వరద బీభత్సం ఎన్నో వేల మంది జీవితాలను ఆగమాగం చేసిందని, తమ వంతు బాధ్యతగా ఆపదలో ఉన్న వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు తాము ముందుకు వచ్చామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ అలుక కిషన్ అన్నారు. ఆపత్కాలంలో మానవతను చాటుకుని ఇంత పెద్ద మొత్తాన్ని వరద బాధితులకు విరాళంగా ఇవ్వడం చాలా అభినందనీయమని షబ్బీర్ అలీ ఉద్యోగ జేఏసీ నాయకులను అభినందించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను షబ్బీర్ అలీ కి విన్నవించుకోగా వాటిపై సానుకూలంగా స్పందించిన ఆయన ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని షబ్బీర్ అలీ ఉద్యోగ జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు.