బీజేపీ సభ్యత్వ నమోదులో నిజామాబాద్ టాప్
భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రాథమిక సభ్యత్వ నమోదులో నిజామాబాద్ జిల్లా 3.50 లక్షల మంది సభ్యత్వంతో తెలంగాణలోనే టాప్ ప్లేస్ లో నిలిచిందని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రాథమిక సభ్యత్వ నమోదులో నిజామాబాద్ జిల్లా 3.50 లక్షల మంది సభ్యత్వంతో తెలంగాణలోనే టాప్ ప్లేస్ లో నిలిచిందని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ జిల్లా కంచుకోటగా ఉందని, భవిష్యత్తులోనూ ఇలాగే ఉండాలని ఆయన అన్నారు. దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యత్వ నమోదును ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీ కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం 200 మందితో సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదు లక్ష్యాలను స్పష్టంగా వివరించాలన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతో దోహదపడుతోందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బాంగ్లాదేశ్ అల్లర్ల మాదిరిగానే భారతదేశంలో కూడా సృష్టించి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుందని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వర్గాల నుంచి సభ్యత్వ నమోదు చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.