నిజామాబాద్ డీసీసీబీ పీఠం మార్పిడి లాంఛనమేనా..?

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఎంపిక

Update: 2024-03-25 14:57 GMT

 దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఎంపిక కార్యక్రమం మంగళవారం జరుగనుంది. ఈ నెల 21న జరిగిన డీసీసీబీ సాధారణ సర్వసభ్య సమావేశంలో తాజామాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దానితో పోచారం భాస్కర్ రెడ్డి పదవి చీత్యులయ్యారు. ఈ నెల 5న నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం లోని మెజార్టీ డైరెక్టర్లు చైర్మన్ భాస్కర్ రెడ్డి పై అవిశ్వాసం ప్రకటించి నోటీసులు డీసీవో కు అందజేశారు. దానితో 21న అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని అధికారులు ప్రకటించారు.

కానీ అనూహ్యంగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి న్యాయస్థానం ఆశ్రయించిన అక్కడ ఆయనకు చుక్కెదురయింది. న్యాయస్థానం భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ ను డిస్మస్ చేయడంతో ఈ నెల 20న భాస్కర్ రెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే రాజీనామా లేఖను స్వయంగా కమిషనర్ కు ఇవ్వకుండా వాట్సాప్ చేశారనే కారణంతో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. అప్పటి వరకు టూర్ లో ఉన్న పాలకవర్గ కార్యవర్గ సభ్యులు నేరుగా డీసీసీబీ బ్యాంక్ కు చేరుకుని డీసీవో నిర్వహించిన అవిశ్వాస తీర్మాణం సమావేశంలో భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. తాత్కాలికంగా డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డిని ఇంచార్జి చైర్మన్ గా నియమించారు. సహకార చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ నెల 26న కొత్త చైర్మన్ ఎంపిక కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు.

దానితో కొత్త చైర్మన్ ఎవరనే ప్రశ్న మొదలయింది. అయితే డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పై అవిశ్వాసం పెట్టింది మొదలు అది నెగ్గే వరకు చక్రం తిప్పిన వేల్పూర్ కు చెందిన కుంట రమేష్ రెడ్డి చైర్మన్ ఎంపిక కావడం లాంచనమేనని చెప్పాలి. రూల్స్ ప్రకారం మంగళవారం జరిగే సమావేశంలో ఆయనను పాలకవర్గం డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఖాయమైంది. పాలకవర్గం డైరెక్టర్లు క్యాంప్ రాజకీయాలకు వెళ్లినప్పుడు డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి తాజా మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై సహకార శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు సంవత్సరాల పదవి కాలంలో అధికార దుర్వినియోగం, అవినీతిపై విచారణ జరుపాలని రమేష్ రెడ్డి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అయితే దాని వెనుక రాజకీయ కోణం ఉందనే చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు రాష్ట్ర మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న కుంట రమేష్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవిపై కన్నేయడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రితో ఉన్న బంధుత్వమే కారణమని చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు మెజార్టీ డైరెక్టర్లు బీఆర్ఎస్ లో ఉండగా ఇప్పుడంతా కాంగ్రెస్ వైపే జై కొట్టారు.

అవిశ్వాస తీర్మాణం సమయంలో 17 మంది డైరెక్టర్లు హాజరుకాగా 16 మంది కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవి మార్పిడి వెనుక మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చక్రం తిప్పారని చర్చ జరుగుతుంది. 2014లో సుదర్శన్ రెడ్డి ఓటమి కాగా ఆయన అనుచరుడైన పట్వారి గంగాధర్ డీసీసీబీ చైర్మన్ ఆయనను గద్దె దించుతామని బీఆర్ఎస్ బెదిరించి పార్టీలో చేర్చుకుంది. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో లేకపోవడం, తాను ఓడిపోవడంతో సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చిన తర్వాత డీసీసీబీ చైర్మన్ పీఠంను దక్కించుకునేందుకు పావులు కదిపింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడైన భాస్కర్ రెడ్డి పార్టీని వీడలేక కాంగ్రెస్ లో చేరలేక తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. సుదర్శన్ రెడ్డి మాత్రం తాను అనుకున్నట్లే కాంగ్రెస్ కు డీసీసీబీ పీఠంను దక్కడంలో చక్రం తిప్పారని చెప్పాలి.


Similar News