దిశ ప్రతినిధి, నిజామాబాద్: సెల్‌ఫోన్ వినియోగం పెరిగిపోయి యువకులు పక్కదారి పడుతున్నారు. మంచి విషయాలకు వినియోగించుకోవాల్సి ఉండగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. విద్యార్థులు సైతం చదువును పక్కనపెట్టి సెల్‌ఫోన్ల పైనే ఎక్కువ దృష్టి సారించారు. వాటి ప్రభావంతో పలువురు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో పలు నేరాలకు పాల్పడుతున్నారు. బైకులపై షికార్లు కొట్టేందుకు, బైకు దొంగతనాలకు పాల్పడుతూ, మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బాని సలై చివరికి డబ్బుకోసం గంజాయి, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు.
మరోవైపు క్రికెట్ బెట్టింగ్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతోనే క్రికెట్ పందాలను ఎంచుకుని డబ్బు పోగొట్టుకుని అప్పుల పాలై చివరికి బెట్టింగ్ బుకీలుగా మారుతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సైతం బుకీలుగా మారి లాడ్జీలు, అద్దె ఇళ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు దొరికిన సందర్భాలున్నాయి. చోరీలకు పాల్పడుతున్నవారిలో యువకులు ఎక్కువగా ఉంటున్నారు. ఉపాధి పై ధ్యాస లేదు.. ఉద్యోగాలపై ఆశ లేదు.. ఉన్నదల్లా కష్టపడకుండా ఈజీగా మనీ సంపాదించాలన్న అత్యాశే. ఈ అత్యాశే యువతను నేరాల మార్గం వైపు నడిపిస్తోంది. బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకునేలా చేస్తోంది. కష్టపడకుండా డబ్బు సంపాదించడంలో ఉన్న మజా అనుభవిస్తేనే తెలుస్తుందని గర్వంగా చెప్పుకుంటూ నేరాలు చేస్తుండటం గమనార్హం.
యువతలో నేరప్రవృత్తి అలవాటుపై పోలీసు శాఖ ఎన్నో సార్లు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ఆ మేరకు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా స్వయం ఉపాధి మార్గాలకు అవకాశాలు కల్పించే స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నాయి. వివిధ పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలపై స్వయం ఉపాధి కోసం రుణాలను కూడా అందిస్తున్నాయి.
ఎన్ని చేసినా ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ వారు, జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకునే క్రమంలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ల మార్గాన్ని ఎంచుకున్నారు. ఇటీవల వివిద ప్రాంతాల్లో దొంగ తనాల్లో కేసుల్లో పట్టుబడిన యువకులను విచారిస్తే వారిలో చాలా మంది బీటెక్ వంటి డిగ్రీలు, దొంగతనాల కేసుల్లో అక్కడక్కడా పట్టుబడిన కేసుల్లో మాస్టర్ డిగ్రీలు చేసిన వారితో పాటు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు మధ్యలో వదిలేసిన వారు కూడా ఉన్నారని పోలీసులు తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
జిల్లాలో అక్కడక్కడా జరిగిన సంఘటనలు..
- మెండోరా మండలంలోని దూదిగాం గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మంగళవారం ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి రోడ్డు పై నడుస్తున్న నిర్మల్ జిల్లా గొల్లంపేటకు చెందిన నంద స్వప్న అనే మహిళ మెడలో నుండి రెండు తులాల బంగారు గొలుసును లాగేసుకుని పరారయ్యారు.
- పండరి అనే యువకుడు జల్సాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు జల్సాల కోసం ఒంటరిగా ఉండే వృద్ధులను టార్గెట్ గా చేసుకుని వారి ఒంటి మీదున్న బంగారు గొలుసులు, ఇతర వస్తువులు దొంగిలించడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఇదే క్రమంలో కామారెడ్డి మండలం బిచ్కుంద మండలంలో గోనే కాశవ్వ అనే ఓ వృద్ధురాలిని నాలుగు రోజుల క్రితం రోకలి బండతో కొట్టి చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారు వస్తువులు దొంగిలించాడు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
- బాల్కొండ మండల కేంద్రంలో ఒక గృహిణి తన పిల్లలను స్కూల్ లో దింపేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వేగంగా వచ్చి ఆమె మెడలో నుంచి గొలుసు లాగేసుకుపోయారు.
- యెర్గట్ల మండలం పాలెం శివారులోని కస్తూర్బా పాఠశాల సమీపంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వృద్ధ దంపతులు స్కూటీపై వెళుతుండగా వెనక నుండి బైక్ పై వేగంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళమెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిపోయారు.
- బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న మహిళలు
- జిల్లాలో తరచూ అక్కడక్కడా మహిళ మెడలోంచి చైన్ స్నాచింగ్ చేసిన సంఘటనలు, దాడులు చేసి దోచుకున్న వంటి సంఘటనలు తెలిసి మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులున్నాయి. పో లీసు శాఖ ఎంతగా ప్రయత్నిస్తున్నా చైన్ స్నాచింగ్, ఒంటరి మహిళలపై దాడులు వంటి సంఘటనలు జరుగకుండా అడ్డుకోలేక పోవడం జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
- ప్రభుత్వం ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగావకాశాలు పెంచితే యువత నేరాలకు పాల్పడుతున్న ఘటనల తగ్గే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు.