Fraud : తూకంలో కొత్త టెక్నాలజీ...నిలువునా మోసం చేస్తున్న దళారులు

టెక్నాలజీ పెరిగిపోయిన కొద్ది.. మోసాలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి

Update: 2024-10-29 14:03 GMT

దిశ, గాంధారి: టెక్నాలజీ పెరిగిపోయిన కొద్ది.. మోసాలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. చివరికి అన్నం పెట్టే రైతన్న కూడా నిలువుగా నట్టేట ముంచుతున్నారు. రైతులు వేసే పంట వేసేటప్పుడు ఏ పంట వేయాలో ఆలోచించి.. ఏ పంట వేస్తే దిగుబడి ఆదాయం మంచిగా వస్తుందో అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మెరుగైన నాణ్యమైన విత్తనాలు కొని.. వాటిని తన పొలంలో పండించి ఆ పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గడ్డి మందులు, ఇతర పంట పెరిగేందుకు వివిధ రకాల మందులు పిచికారి చేస్తూ.. పంట చేతికి వచ్చే వరకు రైతు తన దృష్టి మొత్తం దానిపైనే ఉంటుంది. ఇలాగో నానా తంటాలు పడి పండించిన పంటను తీసుకొచ్చి అమ్ముదామంటే.. అక్కడ కూడా దళారీ వ్యవస్థ నూతనంగా వచ్చిన రిమోట్ పరికరాలతో రైతన్నను నట్టేట ముంచుతున్నారు.

రిమోట్ నొక్కితే 10 కేజీలు తక్కువ.....

రైతన్నల ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ తనను ఎవరు మోసం చేయారనే నమ్మకంతో..అందర్నీ నమ్ముతూ అప్పుల పాలవుతూనే ఉన్నారు. ఎందుకంటే తూకంలో కొత్త ఒరవడితో ఒక సంచికి 10 కిలోల నియంత్రణతో రిమోట్ కంట్రోల్ సిస్టం ను ఏర్పాటు చేసుకొని 40 కిలోలు ఉన్న బస్తాను 30 కిలోలుగా చూపించవచ్చు అది కేవలం రిమోట్ బటన్ నొక్కితే 10 కిలోలు మైనస్ గా పడి విక్రయాలు ప్లస్ గా 10 కిలోలు అవుతుంది.

అకాల వర్షాలు ఆగమవుతున్న అన్నదాత

అన్నదాత అంటే ప్రకృతి కూడా సహకరించడం లేదు ఎప్పుడు ఎక్కడి నుండి ఏ వర్షాలు వస్తాయని బిక్కుబిక్కుమంటూ రోడ్డుపై, మార్కెట్ కమిటీలలో ఆరబెట్టిన పంటను వర్షం వస్తే టార్పల్లిన్ కవర్లు పట్టుకొని తన పంటను కాపాడుకునేందుకు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.. అన్నదాత వేసిన పంటలను ఆరబెట్టుకునేందుకు స్థలం లేక రోడ్డుపై ఆరబోస్తే అటు పోలీసు శాఖ నుంచి రోడ్డుపై ఆరబోయొద్దని ఒత్తిడి రావడం జరుగుతుంది. ఇలా ఎటు చూసినా ఏ రకంగా చూసిన అన్నం పెట్టే అన్నదాతకు అందరూ అండగా ఉండాల్సింది కానీ.. మనకేం పట్టనట్టుగా ఉంటున్నాం.

ఈసారైనా తూకంలో మోసం చేయకుండా మార్పు వచ్చేనా ..

గత ఏడాది తూకంలో మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. తూకంలో ఏకంగా 10 నుంచి 15 కిలోలు తక్కువ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు తనిఖీలకు వస్తున్నారని ముందస్తు సమాచారంతో దళారులు, కొనుగోలుదారులు వాటిని పక్కనపెట్టి ఏ మాత్రం తూకంలో నష్టం జరగడంలేదని వారి ముందు చెప్పడం జరుగుతుంది. కానీ అధికారులు వెళ్లడమే తరువాయి తరువాత వారు చేయాల్సింది వారు చేస్తూనే ఉంటారు.


Similar News