ఇన్చార్జి పోస్టులు వీడేందుకు ససేమిరా…బల్దియాలో కొత్త లొల్లి

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్త వివాదం రాజుకుంటుంది. గతంలో నిజామాబాద్ బల్దియా అవసరాల కోసం నియమించిన ఇన్చార్జిలను పక్కకు తప్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేసింది

Update: 2024-07-09 16:13 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్త వివాదం రాజుకుంటుంది. గతంలో నిజామాబాద్ బల్దియా అవసరాల కోసం నియమించిన ఇన్చార్జిలను పక్కకు తప్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేసింది. దానికి కమిషనర్ ఆమోదముద్రవేసి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇన్చార్జి పదవులను వీడేందుకు వారు ససేమీరా అంటున్నారు. ఇన్చార్జి పదవులను వీడవద్దని పాలకవర్గంలోని కీలక భూమిక వహించే నాయకుల తో ఒత్తిడి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెండింగ్లో ఉన్న ట్రేడ్ లైసెన్సులు, రెవిన్యూ కలెక్షన్ కోసం కొంతకాలం క్రితం 26 మందిని ఇన్చార్జిలుగా నియమించారు.

అందులో ఏడుగురు రెగ్యులర్ మున్సిపల్ జవాన్లను సానిటరీ ఇన్స్పెక్టర్గా నియమించారు. నలుగురు పబ్లిక్ హెల్త్ వర్కర్లు, నలుగురు రెగ్యులర్ అటెండర్ లను, 11 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మొత్తం కలిపి 19 మందిని బిల్ కలెక్టర్లుగా నియమించారు. వారు గత కొంతకాలంగా సానిటరీ ఇన్స్పెక్టర్ గా బిల్ కలెక్టర్ గా చలామణి అవుతున్నారు. ఇప్పటికే ట్రేడ్ లైసెన్స్ ల, రెవిన్యూ బిల్ కలెక్షన్లు పూర్తికాగా ఇటీవల కొందరు ఇన్చార్జిలను కొనసాగించడానికి తప్పు పట్టారు. గత నెలలో జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో ఇన్చార్జిలను తప్పించాలని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

ఈ మేరకు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ 26 మంది ఇన్చార్జిలను విధుల నుంచి తప్పిస్తూ వారికి గతంలో కేటాయించిన పనులు జరపాలని ఎమ్మెహెచ్ఓ కు రిపోర్ట్ చేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొందరు నిజామాబాద్ బల్దియాలో చాలామంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే రెగ్యులర్ మాదిరిగా పనిచేస్తున్నారని తమను ఎలా పనిచేయకుండా అడ్డుకుంటారని మండిపడుతున్నారు. ఈ విషయంలో కొందరు కార్పొరేటర్లు మరికొంతమంది నాయకులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను ఇంచార్జి పదవుల నుంచి తప్పించవద్దని అలా తప్పిస్తే బల్దియాలో ఇన్చార్జిలో కొనసాగుతున్న అందరిని తప్పించాలని డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు.


Similar News