కొత్త కలెక్టరేట్ ఎఫెక్ట్.. రైసు మిల్లులకు అప్రకటిత హాలీడే

Update: 2023-03-17 15:28 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సహజంగా పరిశ్రమలకు పవర్ హాలీడేలు చూసే ఉంటాం. వ్యవసాయానికి పంటల మార్పిడి కొరకు క్రాఫ్ హాలీడేస్ చూస్తున్నాం. కానీ నిజామాబాద్‌కు వచ్చే సరికి అప్రకటిత హాలీడే కొనసాగుతుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలంటే రైసుమిల్లులు మాత్రమే. అలాంటి రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండడంతో మిల్లర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైసు మిల్లులకు 24 గంటలు మిల్లింగ్ కోసం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్ ) ను కేటాయించడంతో ఉమ్మడి జిల్లాలో 400 పైచిలుకు రైసుమిల్లులు ఎంతో మందికి ఉపాధిని ఇస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో రైసు మిల్లులకు గుండెకాయ అనగానే ఖానాపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా అని చెబుతారు. ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ అతిపెద్ద రైసు మిల్లులను ఏర్పాటు చేశారు. వాటి సామర్థ్యం ఆసియాలో ఇతర మిల్లులతో పోటీ పడేటంతగా ఉంది. ఇప్పుడు అక్కడ అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా మిల్లులలో మర ఆడించేందుకు 12 గంటలు మాత్రమే టైంను ఇవ్వడంతో మిల్లర్లు దాని ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికులకు కష్టాలు తప్పడం లేదు.

ఖానాపూర్ ఇండస్ట్రీయల్ జోన్‌కు గతేడాది సెప్టెంబర్ 5 నుంచి కొత్త కష్టం వచ్చింది. ఆ కొత్త కష్టం పేరే డిస్ట్రిక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ లో ప్రారంభించింది మొదలుకుని అక్కడ రైస్ మిల్లులకు కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీయల్ జోన్ ఏరియాలో నిర్మించింది మొదలు అది ప్రారంభం కావడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. గత ఏడు నెలలుగా రైసు మిల్లుల నుంచి వస్తున్న దుమ్ము, ధూళి కొత్త కలెక్టరేట్ ను కప్పివేస్తుందని పరిమితులు విధించినట్లు సమాచారం.

అక్కడ మిల్లులను సాయంత్రం కలెక్టరేట్ కు తాళం వేసింది మొదలుకుని ఉదయం వరకు నడుపు కోవాలని ఆదేశించినట్లు చేసింది. దానితో ఇప్పుడు ఖానాపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా లో రైసుమిల్లులు సాయంత్రం అయితేనే కూత పెడుతున్నాయి. కొత్త కలెక్టరేట్ లో 40 శాఖలు 800కు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లా పాలన అధికారి మొదలుకుని ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ అక్కడే విధులు నిర్వహిస్తుండడంతో దుమ్ము దూళి వస్తుందని మిల్లింగ్‌ను నిలిపివేసినట్లు సమాచారం తెలిసింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఖానాపూర్ ఇండస్ట్రీయల్ జోన్‌కు ఆనుకుని దుబ్బ శివారు ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ నీటిని శుద్ధి చేయడానికి సీనరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)కి భూ సేకరణ చేశారు. సుమారు 80 ఎకరాల్లో భూ సేకరణ జరిగింది. అయితే అక్కడ 25 ఎకరాల్లోనే ఎస్టీపీ ని నిర్మించారు. మిగిలిన 50 ఎకరాలు ఖాళీగా ఉండగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్‌లో అప్పటికే ఉన్న పాత కలెక్టరేట్ కాదని కొత్త కలెక్టరేట్ ను మిగిలిన 50 ఎకరాల స్థలంలోని 25 ఎకరాల్లో నిర్మించాలని సంకల్పించారు.

అప్పటికే ఇండస్ట్రీయల్ జోన్‌గా ఉన్న ఖానాపూర్‌లో ఉన్న రైసుమిల్లులను ఖాళీ చేయాలని నిర్ణయించారు. కొత్త కలెక్టరేట్ కడితే అక్కడ దుమ్ము ధూళి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైసుమిల్లులను నందిపేట్ లోని లక్కంపల్లి సెజ్‌కు తరలించాలని నిర్ణయించారు. అందుకు మిల్లర్లతో జిల్లా అధికార యంత్రాంగం చర్చలు జరిపింది. కానీ రైస్ మిల్లర్లు ఇక్కడి నుంచి కదలలేదు. కలెక్టరేట్ పూర్తి కావడంతో దుమ్ము ధూళిని కారణంగా చూపి ఉదయం నుంచి సాయంత్రం వరకు మిల్లింగ్‌ను మాత్రం నిలిపివేశారు. దీంతో మిల్లర్లు లబోదిబోమంటున్నారు. తమకు గడువు ఇచ్చి పరిశ్రమల మార్పుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Tags:    

Similar News