నా రాజకీయ వారసుడు భాస్కర్ రెడ్డినే

నా రాజకీయ వారసుడు భాస్కర్ రెడ్డినే అని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

Update: 2024-03-26 12:23 GMT

దిశ, బాన్సువాడ : నా రాజకీయ వారసుడు భాస్కర్ రెడ్డినే అని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచనతో పోచారం భాస్కర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ గా నియమిస్తున్నానని పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం బాన్సువాడ పట్టణ శివారులో గల కొల్లూరు రోడ్డు లోని ఎస్​ఎంబీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ తన రాజకీయ వారసత్వానికి సంబంధించిన సందిగ్దతకు తెరదించుతూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో పోచారం భాస్కర్ రెడ్డిని తన రాజకీయ వారసుడుగా ప్రకటించారు. అదేవిధంగా పోచారం భాస్కర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జీగా నియమిస్తున్నానని అన్నారు. మనమందరం కలిసి కట్టుగా కృషి చేసి జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే

    మన తరుపున బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఢిల్లీలో ఉండాలని, గతంలో ఎంపీలుగా పనిచేసి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న బీబీ పాటిల్, సురేష్ షేట్కార్ లు ఈ ప్రాంత అభివృద్ధికి ఏ మాత్రం నిధులు తీసుకురాలేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏం పని చేశావు అని బీబీ పాటిల్ ను అడుగుతున్నానన్నారు. ఢిల్లీలో కూర్చోని సొంత ఫైరవీలు, వ్యాపారాలు చేసుకోవడం తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఏం మేలు చేయలేదని, ప్రజల సమస్యలను బాగు చేయడానికి గ్రామాలలో ఏనాడూ తిరిగింది లేదని, ప్రజల సమస్యలు తెలుకున్నది లేదన్నారు. బీబీ పాటిల్ కు ఎందుకు ఓట్లు వెయ్యాలని ప్రశ్నించారు. సురేష్ షెట్కార్ కూడా గతంలో అయిదేళ్లు ఎంపీగా పనిచేశారని, నువ్వు అప్పుడు ఏం పని చేశావో చెప్పి ఇప్పుడు ప్రజలకు ఓట్లు అడగాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో పుష్కలంగా నిధులు తీసుకువచ్చి తాను బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఈరోజు ప్రజలకు ఓట్లు అడిగే అర్హత తనకు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత మొదలైందని, దానిని మనం

     సానుకూలంగా మలుచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలను ఇచ్చిందని, రైతుబంధు పథకం మొత్తాన్ని రూ. 10,000 నుండి రూ. 15,000 కు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు, ఇప్పటి వరకు పెంచలేదు సరికదా అసలు మూడు ఎకరాలకు మించి ఇయ్యలేదన్నారు. రుణమాఫీ లేదని, 24 గంటల కరంటు కూడా రావడం లేదన్నారు. కౌలు రైతులకు రూ. 15,000 ఆర్థిక సహాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12,500 ఇప్పటికీ లేదన్నారు. క్వింటాలుకు బోనస్ రూ. 500 అమలు చేయలేదని, నిరుద్యోగ భృతి లేదని, ఇందిరమ్మ ఇల్లు కూడా లేవన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఇంకా మొదలు పెట్టలేదన్నారు. మహిళలకు రూ. 2500 భృతి అన్నారు, ఇంకా లేదని, మొత్తం 420 హామీలలో ఏవీ అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పి ఓట్లు అడుగుతారని, అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ కార్పొరేషన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ట్రాన్స్ కో , గ్యాస్ సిలెండర్ సబ్సిడీని పౌరసరఫరాల కార్పొరేషన్ భరిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన నిధుల

    నుండి రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని, 110 రోజులైనా ఏ అర్హతతో ఓట్లు అడుగుతారని, రైతులను కడుపులో పెట్టుకుని కాపాడిన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉన్నదని, రాజకీయాలలో బండ్లు ఓడలు అవుతాయని, ఓడలు బండ్లు అవుతాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల తదుపరి రాజకీయాలలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవ్వరికీ తెలీదని, ఎప్పుడు ఏమైనా జరగవచ్చన్నారు. మనకు ఇప్పుడు చీకటి రోజులు వచ్చాయని, భవిష్యత్తులో మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు శాశ్వతం కాదని, కానీ శాసనసభ్యుడు మాత్రం అయిదేళ్లు శాశ్వతమన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో పంటలు ఎండిపోతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుంట కూడా ఎండిపోలేదని, ఇప్పుడు పట్టించుకునే నాధుడు లేడని, కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండిపోలేదని రైతులు ఆలోచిస్తున్నారన్నారు. రైతుబంధు డబ్బులు ఠంఛనుగా వచ్చేవని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు

     చేయాలంటే ఏడాదికి మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలన్నారు. పాత పద్దతిలో రైతుబంధు ఇవ్వడానికి రూ. 15,000 కోట్లే లేవని, ఇంకా మిగిలినవి ఎలా తెస్తారన్నారు. అధికారంలోకి రావాలనే కోరికతో అలివికాని హామీలు ఇచ్చారని, అనిల్ కుమార్ ని మంచి మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. తాను ఎమ్మెల్యే గా, అనిల్ కుమార్ ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ఈ ప్రాంతం మీదుగా నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ను తీసుకువచ్చి మన ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చేందే విదంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని సోషల్ మీడియాల్లో తాను కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్లు అవాస్తవ కథనాలు వస్తున్నాయని, నాకు బీఆర్ఎస్ పార్టీలో గౌరవం ఉన్నదని, పదవులు అనుభవించి పార్టీలు మారే వాడిని కాదన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని ప్రకటించారు. కార్యక్రమంలో జహిరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, నాయకులు బద్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు. 


Similar News