ఎంపీడీఓ చెబితేనే లంచం తీసుకున్నా...సీనియర్ అసిస్టెంట్ వెల్లడి

కమ్మర్ పల్లి మండల పరిషత్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు మంగళవారం జరిపిన దాడులు కలకలం రేపాయి.

Update: 2024-03-26 12:58 GMT

దిశ, భీంగల్ : కమ్మర్ పల్లి మండల పరిషత్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు మంగళవారం జరిపిన దాడులు కలకలం రేపాయి. ఇందులో ఎంపీడీఓ చెబితేనే లంచం తీసుకున్నా అని సీనియర్ అసిస్టెంట్ వెల్లడించారు. గత అసెంబ్లీ ఎలక్షన్ లో కొన్ని రోజులే కమ్మర్ పల్లి ఎంపీడీఓ ఆఫీస్ లో పని చేసి వెళ్లిన భాగయ్య అనే ఉద్యోగి తన సర్వీస్ బుక్ లో సర్వీస్ డీటెయిల్స్ నమోదు చేయాలని సీనియర్ అసిస్టెంట్ ను అడగగా అందుకు రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దాంతో సరే అని అంగీకరించిన బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

    ఏసీబీ అధికారుల సూచన మేరకు మంగళవారం బాధితుడు ప్లాన్ ప్రకారం సీనియర్ అసిస్టెంట్ హరిబాబుకు లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. హరిబాబును అదుపులోకి తీసుకొన్న ఏసీబీ అధికారులు ఆయన్ని విచారించగా అప్పటి ఎంపీడీఓ డబ్బులు తీసుకొమ్మన్నాడని, అందుకే తీసుకొన్నానని ఏసీబీ అధికారులకు చెప్పాడు. దాంతో ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బికనూర్ లో పని చేస్తున్న ఎంపీడీఓ సంతోష్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని కమ్మర్ పల్లి కి తీసుకొచ్చి ఇద్దరు నిందితులను విచారిస్తున్నారు. విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యం లో పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.విచారణ అనంతరం ఏ 1 నిందితుడిగా ఎంపీడీఓ సంతోష్ రెడ్డిని, ఏ 2 నిందితుడిగా సీనియర్ అసిస్టెంట్ హరిబాబు పై కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్ కు పంపనున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు.


Similar News