అధైర్య పడవద్దు.. అండగా నిలబడతా : మహమ్మద్ అలీ షబ్బీర్

వరద నీరు ఇప్పట్లో ఖాళీ అయ్యే ప్రసక్తే లేదు... పర్మినెంట్ గా ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేస్తున్నానని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో పాటు, ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

Update: 2024-09-03 15:25 GMT

దిశ, భిక్కనూరు : వరద నీరు ఇప్పట్లో ఖాళీ అయ్యే ప్రసక్తే లేదు... పర్మినెంట్ గా ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేస్తున్నానని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో పాటు, ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలోని డబుల్ బెడ్ రూం ఇండ్లకు వరద నీరు భారీగా వచ్చిన చేరిన విషయం విధితమే. ఈ విషయం తెలుసుకున్న ఆయన పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి మంగళవారం వెళ్లి పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా డబుల్ బెడ్ రూం ఇండ్లలోనే ఉంటారా...? లేక సొంతిల్లు కట్టుకుంటామంటే, ప్రభుత్వమే స్థలం ఇప్పించడంతో పాటు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ పథకం కింద ఇప్పిస్తానని, ఎస్సీ, ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇప్పిస్తానని చెప్పారు. ఇక ఆ డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఉండలేమని, మమ్మల్ని వేరే చోటుకు తరలించి ఆవాసం కల్పించాలని బాధితులు షబ్బీర్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే విధంగా వర్షాలు కురిసి, డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి నీళ్లు వచ్చి చేరితే, ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి చేరుకొని, పడవలో తిరుగుతూ పరిస్థితిని గమనించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాసులకు కక్కుర్తి పడి ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్లు కట్టించడం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అందుకోసమే జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఆలోచన చేస్తున్నానని అధైర్య పడవద్దని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. ఖర్చులకోసం ఇప్పుడైతే షబ్బీర్ అలీ ఫౌండేషన్, కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఒక్కో కుటుంబానికి 2 వేల రూపాయల నగదుతో పాటు, పండ్లను 17 బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. చిన్నారులకు పెద్దలకు బట్టలు కూడా అందజేస్తానని ప్రకటించారు. ఇవే కాకుండా మీరు నివాసం ఉండే విధంగా, వసతులు కల్పించడంతోపాటు, భోజనం ఇతరాత్ర సౌకర్యాలు ప్రభుత్వం తరపున కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని వారికి ధైర్యం నూరిపోశారు. 101 జ్వరంతో బాధపడుతున్నా నాని, అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇక్కడికి వచ్చి మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానన్నారు.

కోటి 63 లక్షలతో ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణం..

44వ జాతీయ రహదారి పక్కన కొట్టుకుపోయి దెబ్బతిన్న సర్వీస్ రోడ్డును బైపాస్ వద్ద ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి 63 లక్షల రూపాయల వ్యయంతో బైపాస్ రోడ్డు కిరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లతో పాటు, దక్షిణ కాశీ భిక్కనూరు సిద్ధ రామేశ్వరాలయం వరకు బిటి రోడ్డు మంజూరైనట్లు పేర్కొన్నారు. హైవే అథారిటీ పరిధిలో ఉన్న సైడ్ డ్రైన్లను కూడా నిర్మించాలని హైవే అథారిటీ పీడీ శ్రీనివాస్ తో మాట్లాడినట్లు ఆయన వివరించారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..

కుండపోతగా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి పంట నష్టం పై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పాపాన పోలేదని, కాని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు, ఒక్కో ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. తమకు రుణమాఫీ కాలేదని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా, సాంకేతిక కారణాల వలన కొందరికి రుణమాఫీ కాకపోయి ఉండవచ్చని, వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి మరోసారి పూర్తి వివరాలు సమర్పించాలన్నారు.

ఆయన వెంట టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మద్ది చంద్ర కాంత్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీమ్ రెడ్డి, బీబీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుతారి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కుంట లింగారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తాటిపాముల లింబాద్రి, తీగల తిరుమల్ గౌడ్, లింగాల కిష్టా గౌడ్, స్వామి, ఇంద్రసేనారెడ్డి, శంకర్ రెడ్డి, అందె దయాకర్ రెడ్డి, పి.నరసింహారెడ్డి, బైండ్ల సుదర్శన్, మద్ది సూర్యకాంత్ రెడ్డి, గొల్లపల్లి వినోద్ గౌడ్, కర్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Similar News