ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలి..
భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గృహం పెర్కిట్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
దిశ, ఆర్మూర్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గృహం పెర్కిట్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ యాసలో, భాషలో చట్టం తనపనితాను చేస్తున్న విషయాన్ని చెప్పాడే తప్ప ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదని అన్నారు. తెలంగాణ యాసా, భాష రాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత వ్యవహారాన్ని తట్టుకోలేక మసిపూసి మారెడుకాయ చేసి బండి సంజయ్ వాక్యాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు.
ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఈ విషయమై మాట్లాడుతున్నారో మరి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి మొదటి పౌరురాలైన మహిళా గవర్నర్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపైన ఎందుకు నోరు మెదపలేదన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మహిళలు, యువతులు, చివరికి చిన్నారి బాలికలు కామాంధుల బలత్కారాలకు, అత్యాచారాలకు బలవుతా ఉంటే ఇవి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడతాఉంటే నోరు విప్పని బీఆర్ఎస్ పార్టీ మహిళలు, స్వయానా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చే అవమానాలకు గురైనా నోరు మెదపని బీఆర్ఎస్ పార్టీ మహిళలు, పార్టీ నాయకులు కవిత ఒక్కరే మహిళ అన్నట్లుగా, మిగతా వారు మహిళలే కాదన్నట్లుగా కవిత విషయంలో బండి సంజయ్ మాట్లాడగానే నోరు ఎలా విప్పారని, మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు.
కవిత అంటే కవిత్వం కాదని కవిత అంటే లిక్కర్ మాఫియా అని. కవితను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని. కవిత ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఈడి ప్రశ్నిస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికి వదిలేసి రాష్ట్ర యంత్రాంగమంతా ఢిల్లీకి వెళ్లడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఈ రాష్ట్రం ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తుందా? లేకుంటే రాజరికంగా నడుస్తుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆలోచించాలన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంటే ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యయుత పరిపాలనకు సమంజసం కాదన్నారు. కవితను బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు.
ముఖ్యమంత్రి కూతురు పైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ చేయకుంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తెలంగాణ ప్రజలే బర్తరఫ్ చేస్తారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు మీసాల రాజేశ్వర్, బీజేపీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఖాందేష్ ప్రశాంత్, కౌన్సిలర్ బ్యావత్ సాయికుమార్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, ఉపాధ్యక్షులు పెరంబదూర్ వాసు, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు గూగులోత్ తిరుపతి నాయక్, మత్స్య సెల్ కన్వీనర్ పోశెట్టి,సిహెచ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.