ఎస్సీ, బీసీ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే..

ప్రభుత్వ హాస్టల్ లో సామాన్యుల పిల్లలు మాత్రమే చదువుతారని, వారికి కనీస సౌకర్యాలు లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-25 10:09 GMT

దిశ, నందిపేట్ : ప్రభుత్వ హాస్టల్ లో సామాన్యుల పిల్లలు మాత్రమే చదువుతారని, వారికి కనీస సౌకర్యాలు లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు ఉదయం నందిపేట్ మండలం, కుద్వన్పూర్ గ్రామంలో ఎస్సీ, బీసీ హాస్టల్స్, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల తనిఖీ చేశారు. వసతి గృహాలలో కలియ తిరుగుతూ పిల్లల సమస్యలను తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానని అన్నారు. పిల్లలతో కలిసి అల్పాహారాన్ని తిన్నారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటిని వృధా కాకుండా అరికట్టడం లేదని, పారిశుద్ధ్యం లోపించిందని, భవనాలు శిథిలావస్తలో ఉన్నాయని విద్యార్థులు ఎమ్మెల్యేకి తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు సరైన సమయానికి రావాలని, పిల్లల తల్లితండ్రులు కూడా నెలకు ఒకసారైనా పాఠశాలను సందర్శించాలని అన్నారు.

విద్యార్థులకు చదువుతో పాటు ఆటలను కూడా ఆడించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లగా చూడాలని తెలిపారు. చిన్న చిన్న పనులను కూడా ఉపాధ్యాయులు ప్రభుత్వం ద్వారా పొందాలని చూడడం సమంజసం కాదని, ప్రతిదీ ప్రభుత్వం చేయాలంటే కుదరదని నీళ్లు వృధా కాకుండా నల్లలు కూడా ప్రభుత్వం పెట్టాలి అనడం సమంజసం కాదని అన్నారు. వంద రూపాయలు కూడా ప్రభుత్వమే ఇవ్వాలి అనడం ఎంతవరకు కరెక్ట్ అని, పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ సొంతంగా భరించాలని మనవి అనుకుంటే ఏదైనా చేయగలుగుతామని అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి నూతన భవనాలు గాని హాస్టల్ కు కావాల్సిన వసతులు ఏర్పాటు అయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు.


Similar News