ఎంపీ అరవింద్ వి అన్నీ అబద్ధాలే : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రిగా తనవంతు బాధ్యతను గుర్తెరిగి ఆ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-01-05 13:13 GMT

దిశ, భీమ్‌గల్ : జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రిగా తనవంతు బాధ్యతను గుర్తెరిగి ఆ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ శివారులోని మాధవనగర్ ఆర్.ఓ.బీ తో పాటు, అర్సపల్లి, సారంగపూర్, నవీపేట్, ఇందల్వాయిల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం నాలుగు పర్యాయాలు కేంద్ర మంత్రికి, రైల్వే బోర్డుకు లేఖలు రాశానని తెలిపారు. 17-05-2022 నాడు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు లేఖలు రాశాను అని 26-09-2022 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖలు రాశానని ఆధారాలతో సహా మంత్రి మీడియా ముందుంచారు. ఫలితంగా అర్సపల్లి ఆర్.ఓ.బీ మంజూరయ్యిందని, ఇది ఎంతో సంతోషాదాయకమని మంత్రి పేర్కొన్నారు.

ప్రజల చిరకాల వాంఛ అయిన మాధవనగర్ ఆర్.ఓ.బి నిర్మాణానికి సైతం తాను ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన పనులకు నిధులు మంజూరు చేయించానని అన్నారు. మాధవనగర్ ఆర్.ఓ.బీకి మొత్తం రూ. 93 కోట్ల నిధులు అవసరముండగా, అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లు ఖర్చు చేస్తోందని, గడిచిన రెండు నెలలుగా పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. మాధవనగర్ ఆర్.ఓ.బీ కి సంబంధించి కేంద్రం తరఫున చేపట్టాల్సిన పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎం.పీ అరవింద్ అబద్ధపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు.

ప్రజల ఓట్లతో గెలిచాననే స్పృహను మర్చిపోయి, దేవుళ్ళ పేరుతో, మతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అయిపోతుంది అనే భ్రమలో ఉన్నాడని ఎద్దేవా చేసారు. దమ్ముంటే తాను ప్రపోజల్ చేసిన మిగతా నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిలను కేంద్రాన్ని ఒప్పించి మంజూరు చేయించాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని ఒకసారి పొరపాటున గెలిపించిన పాపానికి నాలుగు సంవత్సరాలు దాటినా ఎం.పి నయాపైసా నిధులు తేలేదని మండిపడ్డారు.

పేద ప్రజలు ప్రైవేటు హాస్పిటల్ వెళ్తే వైద్య ఖర్చుల కింద కేసీఆర్ ని అడిగి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్నానని, అర్వింద్ కూడా ప్రధాని నుంచి పీఎంఆర్ఎఫ్ ప్రజలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ఎఫ్ కింద ఒక్క బెజ్జొర గ్రామంలోనే 46 మందికి 23 లక్షలు ఆర్ధిక సహాయం అందించామని తెలిపారు. అర్వింద్ ఎంత మందికి ఎన్నిలక్షలు ఇప్పించాడని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలని కోరారు. అర్వింద్ ను ఎంపీగా గెలిపించడం వల్ల జిల్లా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకుండా అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News