రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలే : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..
కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇండ్లతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
దిశ, భీమ్‌గల్ : కేసీఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇండ్లతో సమానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బడాభీంగల్ గ్రామంలో నిర్మించిన 112 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఇండ్లు కాగితాల మీదనే ఉండే, నేడు కేసీఆర్ కట్టించిన ఇండ్లు కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఒక్క ఇంటికి 75వేలు ఇస్తే, ఇంటి జాగా, అన్ని వసతులతో కలిపి కేసీఆర్ 10 లక్షల విలువగల ఇల్లు ఇస్తున్నాడని తెలిపారు. నాడు కాంగ్రెస్ నాయకులు వాళ్ల బంధువులకు ఇండ్లను ఇచ్చుకున్నారు.
నేడు ఏ ఫైరవీ కారుని ప్రమేయం లేకుండా అర్హులైన నిరుపేదలకు పూర్తి ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలు ఆయన వెంట ఉన్నోల్లంతా దొంగలే అని అన్నారు. బాల్కొండలో కట్టిన ప్రతి డబుల్ బెడ్రూం ఇల్లు కేసీఆర్ ఇచ్చిన పైసలతో కట్టిందే, బీజేపీ మోడీది రూపాయి కూడా లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం మాటలు తప్పా రూపాయి సాయం లేదని తెలిపారు. రైతుబంధును కాపీ కొట్టి ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలోఎంత మందికి వచ్చింది. ఇప్పుడు ఎంత మందికి వస్తుందో ఎంపీ అరవింద్ సమాధానం చెప్పాలన్నారు. మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను, రైతులను పీడిస్తూ తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్న మోడీని కేసీఆర్ ప్రశ్నిస్తున్నందకు కేసీఆర్ ను కట్టడి చేయాలని ఆయన బిడ్డ కవిత పై కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు.
ఎల్ఐసీ, ఎస్బీఐలో ప్రజల డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ సంబంధం లేని కేసులో కవితను విచారణ చేస్తున్నారని ఆగ్రహించారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద విచారణ చేయాలని పార్లమెంట్లో ప్రతి ఎంపీ ప్రశ్నిస్తున్నాడని అన్నారు. రైతులు, పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులవి అన్ని అబద్ధపు మాటలు, అసత్యపు ప్రచారాలే అని తెలిపారు. ప్రజలు ఆలోచన చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, డీసీఓ సింహాచలం, జడ్పీటీసీ చౌట్ పల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, ఏఎంసీ గుణ్ వీర్ రెడ్డి, మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, గ్రామ సర్పంచ్ సంజీవ్, కన్నె సురేందర్, మల్లెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.