సీఎంఆర్ కోసం మిల్లర్ల అడ్డదారులు

నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టం మిల్లింగ్ రైస్( సీఎంఆర్) కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.

Update: 2024-01-19 14:30 GMT

దిశ ప్రతినిధి, నిజామాబా‌ద్‌: నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టం మిల్లింగ్ రైస్( సీఎంఆర్) కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా బీహార్ నుంచి రాత్రి వేళల్లో బియ్యంను రప్పించుకుని రిసైక్లింగ్ పద్ధతిలో తిరిగి గవర్నమెంట్‌కు అంటగట్టే పనిలో ఉన్నారు. అందుకు ఉత్తర భారతం నుంచి వచ్చే ధాన్యం సరిపోకపోవడంతో స్థానికంగా పీడీఎస్ దందా చేసే ముఠాలతో మిలాఖత్ అవడమే కాకుండా, నల్గొండ, హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ప్రాంతాలకు చెందిన బియ్యంను నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్‌లోని రైస్ మిల్లులకు అప్పగించే పని జోరుగా సాగుతుంది.

ఈ నెల 15న రాత్రి రుద్రూర్ మండలంలోని ఒక గ్రామంలో సీఎంఆర్‌ను ప్రభుత్వంకు అప్పగించడంతో విఫలమైన మిల్లుకు ఒక లోడ్ బియ్యం కలిగిన బీహార్ నుంచి ఒక లారీ వచ్చింది. రాత్రికి రాత్రే ఆ మిల్లులో సంబంధిత లోడ్ లారీ లోని సన్న బియ్యంను డంప్ చేశారు. అంతే కాకుండా నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్ సమీపంలో ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న 308 క్వింటాళ్ల బియ్యం లోడ్ కలిగిన లారీలను సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ధర్మాబాద్‌కు తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్ తెలిపారు. అనంతరం రూరల్ పోలీసులకు అప్పగించారు. క్వింటాల్ బియ్యాన్ని పట్టుకుంటే హడావుడి చేసే సివిల్ సప్లై అధికారులు ఇప్పటివరకు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. తాజాగా పట్టుబడిన బియ్యం కూడా హైదరాబాద్ నుంచి నేరుగా కోటగిరిలోని ఓ మిల్లుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఓ మిల్లర్‌కు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

2022 - 23 వానకాలం సీజన్, 2022-23 యాసంగి సీజన్‌లో సివిల్ సప్లై అధికారుల అండతో టన్నుల కొద్ది ధాన్యం కేటాయించుకుని వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటంతో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ను ఇవ్వకుండానే రెండు సార్లు మిల్లర్లకు మళ్లి సీజన్‌లో ధాన్యం కేటాయించుకున్నారు. ఇటీవల ప్రభుత్వం మారడంతో నిజామాబాద్ జిల్లాల కేంద్రంగా జరిగిన వందల కోట్ల ధాన్యం కేటాయింపులు వాటి అమ్మకం కుంభకోణం బహిర్గతమైంది. దానితో ప్రభుత్వం మిల్లర్లకు సీఎంఆర్ ఇవ్వడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. ఇవ్వకపోతే 25 శాతం పెనాల్టితో పాటు క్రిమినల్ కేసులకు సిద్ధం అవుతుండటంతో రైస్ మిల్లర్లు పీడీఎస్ బియ్యం దందా చేసే మాఫియాతో బియ్యం సేకరించి రిసైక్లింగ్ రూపంలో తిరిగి అప్పచెప్పే పని జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో 62 బాయిలర్, 218 ముడి రైస్ మిల్లులు ఉన్నాయి. గత కొంత కాలంగా బోధన్ డివిజన్‌లో కేటాయించిన ధాన్యంను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని సోమ్ముచేసుకుంటున్నారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఒక మాజీ ఎమ్మెల్యే అండతో మిల్లర్లు రెచ్చిపోయారు. పెద్ద ఎత్తున అమ్యామ్యాలు చేతికి అందడంతో డిఫాల్టర్లకు కూడా ధాన్యం కేటాయించి తమ ఉడుత భక్తి చాటుకుంది సివిల్ సప్లై శాఖ.

నిజామాబాద్ జిల్లాలో జరిగే ధాన్యం అమ్మకాలు, పీడీఎస్ దందా, రిసైక్లింగ్ దందా తెలిసిన ఒక అధికారి ఏరికోరి జిల్లాకు పోస్టింగ్ తెచ్చుకున్నారు అనే టాక్ ఉంది. ఇదిలా ఉండగా బోధన్ డివిజన్ పరిధిలోని కొన్ని రైస్ మిల్లులకు ఒక్క రూపాయి కరేంట్ బిల్లు చెల్లించకుండా ( అంటే మర ఆడించకుండానే వేల టన్నుల ధాన్యం కేటాయించుకుని) వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న చరిత్ర ఉంది. బోధన్, కోటగిరి, వర్ని, రుద్రూర్, ఎడపల్లి మండలాల్లోని ధాన్యం కేటాయించిన మిల్లర్లకు వచ్చిన కరెంటు బిల్లులు సాక్ష్యం అని చెప్పాలి. ఆయా రైస్ మిల్లులు 2022 - 23 వానకాలం సీజన్‌లో 22, 005 మెట్రిక్ టన్నులు, 2022 - 23 యాసంగీ సీజన్ లో 3,31,289 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాలి. ఇది చాలదన్నట్లు మాజీ ఎమ్మెల్యే తాలూకు రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం గత మూడు సంవత్సరాల్లో 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయింపులు జరుగగా 35 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాలి.

ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. అందులో తిరకాసు ఎమిటంటే రైస్ మిల్లర్లు తమకు ఇతర రైస్ మిల్లు నుంచి ధాన్యం బదలాయింపు జరిగిందంటే వారు ఓకే చెప్పగా ఇప్పడు అక్కడ రైస్ మిల్లర్లు తమకు బియ్యం గింజ బదిలీ కాలేదని పేర్కొనడం దాదాపు పక్షం రోజుల్లో బియ్యం ఎప్‌సీఐకి అప్పగించాలంటే కుదరదని ఈ నేపథ్యంలో మిల్లర్లు రిసైక్లింగ్ దందాకు తెరలేపారు. తాజాగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించినా మార్పు రావట్లేదు. జిల్లాలో పీడీఎస్ మాఫీయా సహాయంతో మిల్లర్లకు రేషన్ బియ్యం తరలించే దందా జోరుగా సాగుతోంది. దానికి సివిల్ సప్లై, పోలీస్ శాఖలు సహయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిసింది. సంక్రాంతి పండుగ రోజు రుద్రూర్ మండలంలోని ఒక గ్రామానికి బీహార్ నుంచి బియ్యం లోడ్ లారీ వచ్చిన విషయం బహిర్గతమైన ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు కాని కేసులు కానీ నమోదు కాలేదు. కానీ సంబంధిత సమాచారం బయటకు పోక్కడానికి కారణమైన వారికి ఖాకీల నుంచి బెదిరింపులు మాత్రం తప్పలేదని సమాచారం.

నిజామాబాద్ నగర శివారులో 300 క్వింటాళ్ల లోడ్‌తో కోటగిరికి తరలుతున్న పీడీఎస్ బియ్యంను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడిలో పట్టుబడిన ఈ విషయం బయటకు పోక్కలేదు. దానిని గప్ చూప్‌గా ఉంచేందుకు యత్నించారు. సారంగాపూర్‌కు చెందిన మాజీ గ్రామ ప్రజా ప్రతినిధి, పీడీఎస్ దందా సూత్రదారి ఈ కేసులో సెటిల్ మెంట్‌కు దిగినట్లు తెలిసింది. ఈ కేసులో దొరికిన వారి కోసం స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సర్కిల్ పరిధిలో చర్చ జరుగుతుంది.


Similar News