ఆర్మూర్‌లో అర్ధ రాత్రి భారీ వర్షం.. జలమయమైన లోతట్టు కాలనీలు

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం

Update: 2024-09-04 10:38 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో పట్టణంలోని పలు లోతట్టు కాలనీలన్నీ జలమయం అయ్యాయి. కాలనీలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ఇండ్లలోకి చేరింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా, పలువురు పట్టణ ప్రజలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో, ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ లకు పట్టణంలో వరదకు గురైన బాధితులు ఫోన్లు చేసి వారి బాధను మొరపెట్టుకున్నారు. పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల రోడ్లపై నీటి ప్రవాహం భారీగా ప్రవహించడంతో ఆ రోడ్ల గుండా వాహనదారులు రాకపోకలు చేసేందుకు నానా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వరద బాధితుల వేడుకోలుతో అధికారులు క్షేత్రస్థాయిలోనికి లోతట్టు ప్రాంతాల ఇండ్ల వద్దకు చేరి సహాయక చర్యలు చేపట్టారు.


దీంతో ఇండ్లలోనికి చేరుకున్న వరద నీరు క్రమంగా బుధవారం ఉదయం తగ్గుముఖం పట్టడంతో వరదకు గురైన పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రాజు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నీరు నిల్వ ఉన్నచోట జేసీబీ సహాయంతో నీటిని తీసి వేయించారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి అయ్యప్ప లావణ్య శ్రీనివాస్ ఆమె ప్రాతినిధ్యం వహించే స్థానిక మున్సిపల్ వార్డులో, మున్సిపల్ రెండవ వార్డ్ కౌన్సిలర్ కందేశ్ సంగీత శ్రీనివాస్ లు సంతోష్ నగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో సందర్శించి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని మున్సిపల్ అధికారులకు సూచించి ప్రజల ఇబ్బందులను తొలగించే ఏర్పాటు చేయాలని కోరారు. వర్షం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వరద వల్ల విష జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ లిక్కి పూర్ణ మౌళి, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.





Similar News