బాండ్ పేపర్ కున్న వాల్యూ పోగొట్టిన ఎంపీ అరవింద్…

పసుపు బోర్డు పేరుతో రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసి ఎంపీ అయిన అరవింద్, బాండ్ పేపర్ కున్న వాల్యూ పోగొట్టాడని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Update: 2023-03-24 17:00 GMT

దిశ, భీమ్‌గల్ : పసుపు బోర్డు పేరుతో రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసి ఎంపీ అయిన అరవింద్, బాండ్ పేపర్ కున్న వాల్యూ పోగొట్టాడని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలోని మున్నూర్ కాపు ఫంక్షన్ హాల్ లో బాల్కొండ మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్లే నేడు తెలంగాణ అన్నివిధాల అభివృద్ది చెందుతుందని అన్నారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నయని తెలిపారు. కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. జూట మాటల బీజేపీ దేశాన్ని సర్వ నాశనం చేస్తోందని చెప్పారు.

రైతులను మోసం చేసిన అర్వింద్ కు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. రైతుబంధును కాపీ కొట్టి ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజనపథకం నిజామాబాద్ జిల్లాలో ఎంత మందికి ఇస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. మోడీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని మాడ్డి పడ్డారు. పేదలను, రైతులను పీడిస్తూ తనకార్పొరేట్ మిత్రులకు దేశసంపదను దోచి పెడుతున్న మోడీని కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడని ఆయన బిడ్డ కవితను కేసుల పేరుతో వేధిస్తున్నారని తెలిపారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

ఎల్ఐసీ, ఎస్బీఐలో ప్రజల డబ్బులు మాయం చేసిన అదానీ మీద విచారణ చేయరు కానీ సంబంధం లేని కేసులో కవితను విచారణ చేస్తున్నారని తెలిపారు. రైతులు, పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఎవరు మంచి చేస్తున్నారో, ఎవరు మాటలు చెప్తున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కంటే ముందు వేల్పూర్ మండల కేంద్రంలో జంబి హనుమాన్ దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి తన సతీమణి నీరజా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామస్థులతో ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది.

Tags:    

Similar News