కేసీఆర్ కు మేడిగడ్డ ప్రాజెక్టు ఏటీఎంలా మారింది

మేడిగడ్డ ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రాజ్ చౌహాన్ ఆరోపించారు.

Update: 2023-11-24 15:26 GMT

దిశ, లింగం పేట్ : మేడిగడ్డ ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రాజ్ చౌహాన్ ఆరోపించారు. శుక్రవారం రాత్రి లింగంపేట మండల కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్​రావుకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం వల్ల 40 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో ఐదు లక్షల కోట్ల రూపాయలను వృథా చేశారని అన్నారు. పథకాల అమలుకు డబ్బులకొడితే ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఆయన అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

    ఎంఐఎం పార్టీ నాయకులు మహారాష్ట్రలో 40 స్థానాల్లో పోటీలో ఉండగా తెలంగాణలో మాత్రం కేవలం ఏడు స్థానాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన అనంతరం పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అలాగే ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ఇందిరాగాంధీ ఇచ్చిన గృహాలు, భూములు గ్రామాల్లో నేటికీ కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పెన్షన్లు ప్రభుత్వ సొత్తు అని ఆయన అన్నారు . అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను అందించడంతోపాటు వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.

    మండల కేంద్రంలో 983 సర్వే నెంబర్​ భూముల సమస్యలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిల దశకు చేరినా ఎమ్మెల్యే సురేందర్ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. గత ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి సురేందర్ ను గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలో చేరి అభివృద్ధిని విస్మరించారని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా గౌడ్ ఎల్లమయ్య, సంతోష్ రెడ్డి, రఫీక్ షాదుల్లా, గులాం ఖదీర్, కౌడ రవి, ఆకుల శ్రీనివాస్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News