ఎమ్మెల్సీ కవిత చేసిన వాఖ్యల పై బహిరంగ సవాల్ విసిరిన మానాల..
కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు.
దిశ, కమ్మర్ పల్లి : కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంగిలి చేతితో కూడా ఏనాడు ప్రజలకు సహాయం చేయలేదని ఎమ్మెల్సీ కవిత చేసిన వాఖ్యలకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. శనివారం రోజున కమ్మర్ పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఎంగిలి చేతితో కూడా ప్రజలకు మేలు చేయలేదని చెప్పిన కవిత ఏనాడైనా సామాన్య ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేశారా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవిత చేసిన మాటలను సవాల్ గా స్వీకరిస్తూ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా ఏ ఊర్లోనైనా ఎక్కడికైనా చర్చకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఒకసారి సామాన్య జనంలోకి వెళ్లి వారితో మాట్లాడి వారి కష్టసుఖాలు చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందని, పారాచూట్ తో వచ్చి పదవులు అనుభవించే వారికో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదవులు తెచ్చుకున్న వారికి అర్థం కాదని ఆయన అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను వడ్డించిన విస్తరిల అప్పగిస్తే తమరు, తమరి తండ్రి కేసీఆర్, తమరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అప్పులపాలు చేసి కుక్కలు చింపిన విస్తరిలా చేశారని మండిపడ్డాడు.
కవిత చేసిన వాఖ్యలకు కట్టుబడి ఉంటే తమరు గానీ, తమ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రి గాని బహిరంగ చర్చకు రావాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ఎంగిలి చేత్తో కూడా సహాయం చేయలేదని విమర్శించే ముందు కవిత ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏలేటి గంగాధర్, జిల్లా కార్యదర్శి తక్కూరి దేవేందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పడిగల ప్రవీణ్, నాయకులు బుచ్చి మల్లయ్య, సుంకటి శ్రీనివాస్, ఉట్నూరు ప్రదీప్, శ్రీరాముల మురళి, కొమ్ముల రాజేందర్, కొమ్ముల రవీందర్, చింతకుంట శ్రీనివాస్, కుందేటి శ్రీనివాస్, అల్లకొండ రాజేష్, పడాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.