వైభవంగా లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు

ఉత్తర తెలంగాణలోనే యాదాద్రి తరువాత అంతటి ప్రాశస్త్యమున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భీమ్ గల్ శివారులోని లింబాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురవారం ప్రారంభమయ్యాయి.

Update: 2024-11-07 16:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణలోనే యాదాద్రి తరువాత అంతటి ప్రాశస్త్యమున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భీమ్ గల్ శివారులోని లింబాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురవారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొండపైకి చేర్చే కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన కార్తీక శుద్ధ గురువారం శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను భీంగల్ పట్టణంలోని నందిగల్లిలో ఉన్న గ్రామాలయం నుంచి ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్లారు.

    భక్తి ప్రపత్తులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముందుగా గ్రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు క్షేత్ర పురాణంలో స్వామి వారి ఆజ్ఞ మేరకు బడాభీంగల్ గ్రామ శివారులోని గ్రామ దేవత ఎల్లమ్మతల్లికి సౌభాగ్య సారెను ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రితో పాటు అర్చకులు సమర్పించారు. అనంతరం స్వామి వారికి నైవేద్యం పెట్టి హారతులిచ్చారు. స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపైకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా పుష్పాలంకృత పల్లకిలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా స్వామి వారి పల్లకిని గ్రామాలయం చుట్టూ ప్రదక్షణ చేయించారు.

    అనంతరం కొండపైకి ఊరేగింపు ప్రారంభమైంది. దాదాపు రెండు వందల మంది ముత్తయిదవలు బోనాలు ఎత్తుకుని, మంగళహారతులతో పల్లకి ముందు నడవగా గ్రామాలయం నుంచి పల్లకి ఊరేగింపు నందిగల్లి, నందిగుడి, ఎస్సీవాడ, ముచ్కూర్ క్రాస్ రోడ్డు, సుదర్శన్ థియేటర్ సర్కిల్, పురానీపేట్ ల మీదుగా స్వామివారి ఊరేగింపు కొండపైకి చేరుకుంది. మార్గమధ్యలో పట్టణం ప్రధాన వీధుల గుండా స్వామి వారి పల్లకి ఊరేగింపు జరుగుతుండగా భక్తులు నీరాజనం పలికారు. పల్లకి యాత్రలో పాల్గొనేందుకు, స్వామివారిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు, మహిళలు బారులు తీరారు.

     ఊరేగంపుగా వెళ్తున్న స్వామివారికి మహిళలు మంగళహారతులతో ఎదరు వచ్చి కొబ్బరికాయలు సమర్పించుకున్నారు. ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గోవిందా.. గోవిందా అంటూ పట్టణ వీధులు పరవశించే విధంగా గోవింద నామస్మరణ చేశారు. మధ్యాహ్నం మూడున్నరకు ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి పల్లకి ఊరేగింపు సాయంత్రం కొండపైకి చేరుకుంది. 

 


Similar News