జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎల్పీజీ సర్వే

జిల్లాలో ఎల్పీజీ సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రజాపాలన సందర్భంగా ప్రజలు సమర్పించిన దరఖాస్తులలో గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న వివరాలను వెంటనే సేకరించి నిర్దారిత యాప్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సర్వే బృందాలను ఆదేశించారు.

Update: 2024-02-08 11:49 GMT

దిశ, కామారెడ్డి : జిల్లాలో ఎల్పీజీ సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రజాపాలన సందర్భంగా ప్రజలు సమర్పించిన దరఖాస్తులలో గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న వివరాలను వెంటనే సేకరించి నిర్దారిత యాప్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సర్వే బృందాలను ఆదేశించారు. గురువారం జిల్లాలోని తహసీల్ధార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ... అభయహస్తం కింద ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే పథకం త్వరలో అమలు చేయాలని యోచిస్తున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశిలించగా సరైన వివరాలు పేర్కొనలేదని గమనించి తిరిగి అట్టి వివరాలు

    సేకరించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. ప్రధానంగా దరఖాస్తులో గ్యాస్ ఏజెన్సీ పేరు, కన్స్యూమర్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ వంటి వివరాలను ప్రజలు సరిగా పొందుపర్చలేదని అన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తప్పిదాలను సరి చేసేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించిందని తెలిపారు. తప్పిదాలను సరి చేసేందుకు ఏర్పాటు చేసిన గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయి బృందాలు తమకు కేటాయించిన ప్రాంతాలను విస్తృతంగా పర్యటించి వివరాలను సేకరించి ప్రత్యేక యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు.

    ఈ సందర్భంగా యాప్ లో వివరాలు ఎలా నమోదు చేయాలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సర్వే బృందాలు ఈ నెల 10 లోగా తప్పిదాలు నమోదు చేసిన దరఖాస్తుదారులను సంప్రదించి సమగ్ర వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేసేలా పర్యవేక్షించాలని ఎంపీడీఓలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్ధార్లకు కలెక్టర్ సూచించారు. ప్రజలు కూడా సర్వే బృందాలకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులు సక్రమంగా ఉన్న వాటికి సంబంధించి వాటి ఆమోదం నిమిత్తం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, సర్వే బృందాలు తమను సంప్రదించలేదని ఇతర దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.


Similar News