పార్టీకి నాయకులు, కార్యకర్తలే బలం

కార్యకర్తలే నాయకులకు మూలాధారమని, కార్యకర్తలు లేనిది నాయకులు తయారు కాలేరని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Update: 2024-04-07 15:19 GMT

దిశ, బాన్సువాడ : కార్యకర్తలే నాయకులకు మూలాధారమని, కార్యకర్తలు లేనిది నాయకులు తయారు కాలేరని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు రాష్ట్రంలో ఒకే కుటుంబం నియంత పాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్టపోయారని, 7 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. పార్టీకి కార్యకర్తలే మూలాధారమని కార్యకర్తలు లేనిది నాయకులు తయారు కారని, కార్యకర్తలను బలోపేతం చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తిరగబడితే ఏదైనా సాధించుకోవచ్చని గత అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ త్యాగధనులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల పార్టీ అని, దేశం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు.

    సమాజం స్వేచ్ఛను కోరుకుంటుందని రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు మన అందరిపై ఉందన్నారు. మార్పు జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని అన్నారు. శాసనసభలో ప్రశ్నిస్తే చిరునవ్వుతో సమాధానం చెప్పే సత్తా నాయకులకు ఉండాలని, ప్రశ్నించే తత్వం ప్రజలకు ఉండాలని అన్నారు. ప్రజలకు జవాబుదారితనంగా ప్రభుత్వం పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం కాపాడుకున్న వారమవుతమన్నారు. బాన్సువాడ ఆస్పత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ కమిటీలే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్ణయించే అధికారాన్ని కట్టబెడుతుందన్నారు.

    రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలలో గుర్తుండిపోయాయని, నాయకుడు అనే వాడు మాట ఇస్తే మాట నిలబెట్టుకునే రకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ, 108, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నో పథకాలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, జహీరాబాద్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నరసింహను పార్టీ సీనియర్ నాయకులు నార్ల రత్నకుమార్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.

    ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, పీసీసీ డెలిగేట్లు వెంకటరామిరెడ్డి, కూనిపుర్ రాజారెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతాప్ సింగ్, మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్, నార్ల రత్నకుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, పాత బాలకృష్ణ, నాయకులు శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మంత్రి గణేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


Similar News